Sunday, December 22, 2024

సమరోత్సాహంతో భారత్

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : ఆస్ట్రేలియాతో జరిగే రెండో టి20 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. విశాఖలో జరిగిన తొలి మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన యువ భారత జట్టు ఈసారి రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. విశాఖలో భారీ స్కోరు సాధించినా ఓటమి పాలై న ఆస్ట్రేలియా ఈసారి విజయమే లక్షంగా పెట్టుకుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకం గా కనిపిస్తున్నాయి. తిరువనంతపురం వేదిక గా ఆదివారం రెండో టి20 జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని ఆతిథ్య భారత్ భావిస్తోంది. ఇక ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లలోనూ విధ్వంసక ఆట గాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

ఓపెనర్లు సత్తా చాటాలి…
తొలి టి20లో ఆశించిన స్థాయిలో శుభారం భం అందించడంలో విఫలమైన ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ ఈసారైనా మెరుగైన ఆరంబాన్ని అందించాల్సిన అవసరం ఉంది. రుతురాజ్ ఖాతా తెరవకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు. యశస్వి ధాటిగా ఆడినా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఇలాంటి స్థితిలో ఓపెనర్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇద్దరు కూడా ఈసారి మెరుగైన స్కోరును చేయాలని భావిస్తున్నారు. టి20లలో ఇద్దరికి కళ్లు చెదిరే రికార్డు ఉంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం.

జోరుమీదున్న సూర్య, ఇషాన్…
మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌లు తొలి మ్యాచ్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించారు. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఇద్దరు పరుగుల వరద పారించారు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. టి20 స్పెషలీస్ట్‌గా పేరున్న సూర్యకుమార్ తొలి మ్యాచ్‌లో అంచనాలకు తగినట్టే రాణించాడు. ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించాలని భావిస్తున్నాడు. ఇషాన్ కూడా ఇదే లక్షంతో ఉన్నాడు. ఇక రింకు సింగ్ రూపంలో మరో విధ్వంసక బ్యాటర్ జట్టుకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. రింకుతో పాటు తెలుగుతేజం తిలక్‌వర్మ బ్యాట్‌ను ఝులిపిస్తే టీమిండియాకు ఈ మ్యాచ్‌లోనూ గెలుపు ఖాయమనే చెప్పాలి. బౌలింగ్‌లో భారత్ సమతూకంగా ఉంది. అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్, రవిబిష్ణోయ్, అక్షర్ పటేల్‌లతో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో బౌలర్లు విఫలం కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. అయి తే ముకేశ్ కుమార్ పొదుపుగా బౌలింగ్ చేయడం జట్టుకు ఊరటనిచ్చే అంశమే.

విజయమే లక్షంగా…
ఇక మొదటి టి20లో ఓడిన ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. విశాఖలో విధ్వంసక సెంచరీతో ఆకట్టుకున్న జోష్ ఇంగ్లిస్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మాథ్యూవేడ్, స్టోయినిస్, స్మిత్ తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక బెహ్రాన్‌డార్ఫ్, సీన్ అబా ట్, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘాలతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.

జట్ల వివరాలు
భారత్ : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్, జితేష్ కుమార్, అవేశ్ ఖాన్, సుందర్, రవి బిష్ణోయ్.
ఆస్ట్రేలియా : మాథ్యూ వేడ్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, స్టోయినిస్,సీన్ అబాట్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, రిచర్డ్‌సన్, అరోన్ హార్ది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News