Sunday, December 22, 2024

సమరోత్సాహంతో భారత్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే చివరి టి20కి సమరోత్సాహంతో సిద్ధమైంది. సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 31 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది.మరోవైపు ఆస్ట్రేలియా కూడా చివరి మ్యాచ్‌లో గెలిచి కాస్తయినా ఊరట పొందాలనే లక్షంతో బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లు కూడా ఆసక్తికరంగానే సాగాయి. తొలి రెండు మ్యాచుల్లో టీమిండియా జయభేరి మోగించగా, మూడో టి20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక కిందటి మ్యాచ్‌లో గెలిచి భారత్ సిరీస్‌ను దక్కించుకుంది. ఇదే జోరును చివరి మ్యాచ్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌లు జోరుమీదున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా శుభారంభం అందించాలనే లక్షంతో ఉన్నారు.

ఇద్దరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా భారత్‌కు భారీ స్కోరు ఖాయం. ఇప్పటికే మూడుసార్లు భారత్ 200కి పైగా పరుగులను సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచాలని భావిస్తోంది. ఓపెనర్లు శుభారంభం అందిస్తే భారత్ ఈసారి భారీ స్కోరు సాధించడమే ఖాయం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడుతున్నాడు. టి20 అంటేనే చెలరేగి ఆడే సూర్యకుమార్ ఆఖరి మ్యాచ్‌లో విజృంభించేందుకు సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా సూర్యకు ఉంది. ఈ మ్యాచ్‌లో అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు కిందటి మ్యాచ్‌లో విఫలమైన స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఈసారి బ్యాట్‌ను ఝులిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. రింకూ సింగ్ కూడా సిరీస్‌లో నిలకడైన బ్యాటింగ్‌ను కనబరచడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.

యువ ఆటగాడు జితేష్ శర్మ ఆరంగేట్రం మ్యాచ్‌లోనూ దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక బౌలింగ్‌లో కూడా భారత్ బలంగానే ఉంది. కిందటి మ్యాచ్‌లో అక్షర్ పటేల్ నిలకడైన బౌలింగ్‌ను కనబరిచాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న టీమిండియా మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
పరువు కోసం..
ఇక ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. కీలక ఆటగాళ్లందరూ ఇప్పటికే స్వదేశం వెళ్లిపోవడంతో ఆస్ట్రేలియా కాస్త బలహీనంగా మారింది. అయినా ట్రావిస్ హెడ్, అరోన్ హార్డి, మాథ్యూ షార్ట్, కెప్టెన్ వేడ్‌లతో బ్యాటింగ్ బలంగానే ఉంది. అంతేగాక బెహ్రాన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, గ్రీన్‌లతో బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. దీంతో వీరికి కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News