Monday, December 23, 2024

భారత మహిళలకు భారీ ఆధిక్యం..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టు సమరంలో ఆతిథ్య భారత్ పటిష్టస్థితికి చేరుకుంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులు చేసింది. జవాబుగా మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. టీమిండియాకు ఇప్పటి వరకు 157 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 98/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటిగ్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్నేహ్ రాణా 9 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. కొద్ది సేపటికే ఓపెనర్ స్మృతి మంధాన కూడా వెనుదిరిగింది. మంధాన 12 ఫోర్లతో 74 పరుగులు సాధించింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో బ్యాటింగ్ చేశారు.

ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు చాలా సేపటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. రక్షణాత్మక బ్యాటింగ్‌ను కనబరిచిన రిచా ఘోష్ 104 బంతుల్లో ఏడు ఫోర్లతో 52 పరుగులు సాధించింది. ఇదే సమయంలో నాలుగో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పింది. తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. వికెట్ కీపర్ యాస్తిక భాటియా (1) కూడా నిరాశ పరిచింది. మరోవైపు నిలకడైన బ్యాటింగ్‌ను కనబరిచిన జెమీమా రోడ్రిగ్స్ 9 ఫోర్లతో 73 పరుగులు చేసి ఔటైంది. దీంతో భారత్ 274 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయింది. కానీ కీలక సమయంలో దీప్తి శర్మ, పూజా వస్త్రకర్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వికెట్లు పతనాన్ని అడ్డుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆసీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన దీప్తి శర్మ 147 బంతుల్లో 9 ఫోర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. మరోవైపు సమన్వయంతో ఆడిన పూజా వస్త్రకర్ 115 బంతుల్లో 4 బౌండరీలతో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఇద్దరు ఇప్పటికే 8వ వికెట్‌కు అజేయంగా 102 పరుగులు జోడించారు. దీంతో భారత్ ఆధిక్యం 157 పరుగులకు చేరింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అష్లే గార్డ్‌నర్ నాలుగు వికెట్లను పడగొట్టింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News