Sunday, January 19, 2025

సమరోత్సాహంతో భారత్

- Advertisement -
- Advertisement -

ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్
నేటి నుంచి ఉప్పల్‌లో తొలి టెస్టు

మన తెలంగాణ/హైదరాబాద్: భారత్‌- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు గురువారం తెరలేవనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య గురువారం నుంచి తొలి టెస్టు జరుగనుంది. ఈ మ్యాచ్‌ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారత్‌కు రోహిత్ శర్మ, ఇంగ్లండ్‌కు బెన్ స్టోక్స్ సారథ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఉప్పల్‌లో ఇప్పటి వరకు ఆడిన ఐదు టెస్టుల్లో నాలుగింటిలో టీమిండియా విజయం సాధించింది.

ఒక టెస్టు డ్రాగా ముగించింది. ఇంగ్లండ్‌పై కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రోహిత్ సేన సమతూకంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, జడేజా, అశ్విన్‌లతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. రోహిత్ శర్మ, గిల్, యశస్విలు ఫామ్‌లో ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. రోహిత్ విజృంభిస్తే టీమిండియాకు భారీ స్కోరు కష్టమేమీ కాదు. గిల్, యశస్వి, శ్రేయస్‌లపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. టాపార్డర్ తమ సత్తాను చాటితే ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు ఖాయం.

ఫేవరెట్‌గా..
మరోవైపు ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సొంత గడ్డపై ఆడుతుండడంతో టీమిండియాకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. రోహిత్, రాహుల్, యశస్వి, గిల్, అయ్యర్, జడేజా, అశ్విన్‌లతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక సిరాజ్, బుమ్రా, అశ్విన్, అక్షర్, కుల్దీప్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. అశ్విన్‌కు ఉప్పల్‌లో అద్భుత రికార్డు ఉంది. ఈ స్టేడియంలో అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతనే జట్టుకు ప్రధాన అస్త్రంగామారాడు. జడేజా రూపంలో మరో పదునైన అస్త్రం ఉండనే ఉంది. ఇద్దరు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఇంగ్లండ్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు.

తక్కువ అంచనా వేయలేం..
ఇదిలావుంటే ఇంగ్లండ్ టీమ్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. జాక్ క్రాలీ, బెన్ ఫోక్స్, జో రూట్, ఒలి పోప్, మార్క్‌వుడ్, బెయిర్‌స్టో, కెప్టెన్ బెన్‌స్టోక్స్‌లతో ఇంగ్లండ్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన క్రాలీ, రూట్, మార్క్‌వుడ్, బెయిర్‌స్టో, జాక్ లీచ్ తదితరులు చెలరేగితే టీమిండియాకు కష్టాలు ఖాయం. దీంతో భారత జట్టు ఏమాత్రం పొరపాట్లకు తావులేకుండా ముందుకు సాగాలి. అతి విశ్వాసానికి పోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాగా, రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

జట్లు వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజిత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, ముకేశ్ కుమార్, శ్రీకర్ భరత్, ధ్రువ్ జురేల్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్.
ఇంగ్లండ్: బెన్‌స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, జాక్ క్రాలీ, బెన్ డుక్కెట్, ఓలిపోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, మార్క్‌వుడ్, ఓలి రాబిన్సన్, అండర్సన్, డానియల్ లారెన్స్, అట్కిన్సన్, టామ్ హార్ట్‌లీ, రెహాన్ అహ్మద్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News