Friday, November 22, 2024

భారత్‌కు ఫాలోఆన్ తప్పదా?

- Advertisement -
- Advertisement -

India vs England 1st Test: Team India scored 257

 

తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు,

ఆదుకున్న పంత్, పుజారా

ఇంగ్లాండ్ ఆలౌట్ 578

చెన్నై: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఫాలోఆన్ ఆడే ప్రమాదం పొంచి ఉంది. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులుచేసింది. దీంతో ప్రత్యర్థికన్నా ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే భారత్ ఫాలోఆన్ ఆడక తప్పేలా లేదు. సోమవారం టెయిలెండర్లు ఎంత మేరకు క్రీజ్‌లో ఉంటారనే దానిపైనే అంతా ఆధారపడి ఉంది. ఆట ముగిసే సమయానికి వాషింగ్టన్ సుందర్ 33 పరుగులు, అశ్విన్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరిపైనే జట్టు ఫాలోఆన్‌నుంచి తప్పించుకోవడం ఆధారపడి ఉంది. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, పుజారా మినహా మిగతా స్టార్ బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమైనారు. రోహిత్ శర్మ కేవలం 6 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, రహానే 1, విరాట్ కోహ్లీ 11 పరుగులు చేసి ఉసూరుమనిపించారు.

అయితే వికెట్ కీపర్ రిషబ్ పంత్, చతేశ్వర్ పుజారాలు మరో సారి జట్టుకు ఆపద్బాంధవులయ్యారు. వారే లేకుంటే టీమిండియా ఈ రోజే ఫాలోఆన్ ఆడాల్సి వచ్చేదేమో. రిషబ్ పంత్ అయితే వన్డే మ్యాచ్ ఆడినట్లుగా ఆడి స్కోరును పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. సెంచరీకి దగ్గరవుతున్నా ఏమాత్రం దూకుడు తగ్గించలేదు. 88 బంతులెదుర్కొన్న పంత్ 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 91 పరుగులు చేసి డామ్ లెస్ బౌలింగ్‌లో జాఖ్ లీచ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా నిలకడగా ఆడిన పుజారా 143 బంతుల్లో 11 ఫోర్లతో 73 పరుగులు చేశాడు.

అంతకు ముందు 8 వికెట్ల నష్టానికి 558 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 23 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లను కోల్పోయింది. బెస్‌ను బుమ్రా వికెట్ల ముందు దొరకపుచ్చుకోగా, ఆండర్సన్‌ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. లీచ్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఆదుకున్న పంత్‌పుజారా జోడీ

ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.19 పరుగుల వద్ద రోహిత్ ఆర్చర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన పుజారాతో కలిసి మరో ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ (29) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే మంచి ఫామ్‌లో ఉన్న గిల్‌ను సట్ చేసి ఆర్చర్ మరోసారి దెబ్బతీశాడు. తర్వాత వచ్చిన కోహ్లీ కూడా లంచ్ విరామం తర్వాత కొద్ది సేపటికే బెస్ బౌలింగ్‌లో పోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే రహానే కూడా కేవలం ఆరు బంతులకే వెనుదిరగడంతో భారత్ 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో పుజారాపంత్ జోడీ జట్టును ఆదుకొంది.

ఐదో వికెట్‌కు 119 పరుగులు జోడించి జట్టును కష్టాలనుంచి గట్టెక్కించారు. వీరిద్దరి జోరు చూస్తే భారత్ మూడో రోజు పటిష్ట స్థితిలో నిలుస్తుందనిపించింది. అయితే 73 పరుగులు చేసిన పుజారా ఔటవడంతో పరిస్థితి మారింది. కానీ పంత్ దూకుడు మాత్రం తగ్గలేదు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి వేగంగా పరుగులు సాధించాడు. సిక్సర్లతో చెలరేగి వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. అయితే బెస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి లీచ్ చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన అశ్విన్‌తో కలిసి సుందర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో కొత్త స్పిన్నర్ డోమ్ బెస్ 4, జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News