Friday, January 31, 2025

రేపు భారత్‌ ఇంగ్లండ్ నాలుగో టి20

- Advertisement -
- Advertisement -

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం పుణె వేదికగా నాలుగో టి20 మ్యాచ్ జరుగనుంది. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టి20లో ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. కాగా, సిరీస్‌లో టీమిండియా 21 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక పుణెలో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది. ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలపనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. రెండు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
ఓపెనర్లు సత్తా చాటాలి..
సిరీస్‌లో టీమిండియాకు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించడం లేదు. ఓపెనర్ సంజు శాంసన్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ నిరాశ పరిచాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా సంజు తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. కనీసం ఈసారైనా బ్యాట్‌ను ఝులిపించాల్సి ఉంది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఒక్క మ్యాచ్‌లో మాత్రమే సత్తా చాటాడు. మిగతా పోటీల్లో తక్కువ స్కోరుకే వెనుదిరిగి నిరాశ పరుస్తున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో అభిషేక్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సి ఉంది.

సూర్య గాడిలో పడాలి..
మరోవైపు టి20 స్పెషలిస్ట్‌గా పేరున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సిరీస్‌లో వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. మూడు మ్యాచుల్లో కూడా విఫలమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సూర్య తక్కువ స్కోరుకే పెవిలియన్ బాటపడుతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. పుణెలోసూర్య మెరుపులు మెరిపించి మళ్లీ గాడిలో పడాలనే లక్షంతో ఉన్నాడు. అతను ఫామ్‌లోకి వస్తే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పే సూర్యకు సిరీస్‌లో ఏదీ కలిసి రావడం లేదు. ఒక్కసారి కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. మిగిలిన రెండు మ్యాచుల్లో సూర్య చెలరేగితే ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక భారత ఆశలన్నీ హైదరాబాదీ తిలక్‌వర్మపైనే నిలిచాయి.

తిలక్ సిరీస్‌లో అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. అయితే కిందటి మ్యాచ్‌లో అతను తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. దీంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. మిగతా బ్యాటర్లు కూడా మెరుపులు మెరిపించాల్సి ఉంది. హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ తదితరులు బ్యాట్‌తో రాణించలేక పోతున్నారు. వీరు వరుస వైఫల్యాలు చవిచూస్తున్నారు. దీంతో టీమిండియాకు ఆశించిన స్థాయిలో స్కోరు లభించడం లేదు. మిగిలిన రెండు మ్యాచుల్లో వీరు మెరుగ్గా రాణిస్తే సిరీస్‌ను సొంతం చేసుకోవడం భారత్‌కు కష్టమేమీ కాదు. ఇక బౌలింగ్ భారత్ చాలా మెరుగ్గా ఉంది. ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్‌తో పాటు స్పిన్నర్లు అద్భుత బౌలింగ్‌ను కనబరుస్తున్నారు. కిందటి మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి ఏకంగా ఐదు వికెట్లను పడగొట్టి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రవి బిష్ణోయ్, అక్షర్, సుందర్‌లతో టీమిండియా బౌలింగ్ బలంగా ఉంది. దీంతోటీమిండియాకు ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

ఆత్మవిశ్వాసంతో..
మరోవైపు కిందటి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. పుణెలోనూ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ సమతూకంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News