రాంచీ : నాలుగో టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లండ్, భారత్ జట్లు జార్ఖండ్ రాజధాని రాంచీ చేరుకున్నాయి. మంగళవారం రాజ్‌కోట్ నుంచి ప్రత్యేక విమానంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇక్కడికి చేరారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్టుకు రాంచీ ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్ల ఆటగాళ్లు ఇక్కడికి చేరుకున్నారు. క్రికెటర్లు కోసం జార్ఖండ్ క్రికెట్ సంఘం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
భారీ భద్రతతో పాటు ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. బుధ, గురు వారాల్లో రెండు జట్ల ఆటగాళ్లు సాధన చేసే అవకాశం ఉంది. సిరీస్‌లో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ముగిసాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ జయకేతనం ఎగుర వేసింది. అయితే తర్వాత విశాఖపట్నం, రాజ్‌కోట్‌లలో జరిగిన టెస్టుల్లో భారత్ జయభేరి మోగించింది. ప్రస్తుతం ఆతిథ్య టీమిండియా సిరీస్‌లో 21లో ఆధిక్యంలో నిలిచింది.
ఘన స్వాగతం…
ఇదిలావుంటే రాంచీ చేరిన భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లకు బిస్రా ముండా విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. జార్ఖండ్ క్రికెట్ సంఘ అధికారులు క్రికెటర్ల కోసం భారీ స్వాగత ఏర్పాట్లను చేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తదితరులకు అభిమానులు నీరాజనం పలికారు. కాగా, తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు, ఆటగాళ్లు బస చేసే హోటల్ల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో రాంచీలో ఎక్కడ చూసిన క్రికెట్ వాతావరణమే కనిపిస్తోంది.