Wednesday, January 22, 2025

తొలిరోజు భారత్‌దే!

- Advertisement -
- Advertisement -

 చెలరేగిన కుల్‌దీప్, అశ్విన్
218 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్
 భారత్ తొలి ఇన్నింగ్స్ 135/1

ధర్మశాల : చివరి టెస్టులో భారత్ పూర్తి ఆదిపత్యం చెలాయించింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లీస్ బ్యాటర్లు తొలి రోజే తేలిపోయారు. ఇంగ్లండ్ జట్టులో మార్పులు ఫలించినట్టు కనిపించలేదు. ఇప్పటికే సిరీస్ కోల్పోయి పరువు నిలుపుకోవాలనుకున్న ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో చెత్త బ్యాటింగ్‌తో చేతులెత్తేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఆతిధ్య జట్టు భారత స్పిన్నర్ల ధాటికి కేవలం 218 పరుగులు మాత్రమే చేసి తొలి ఇన్నింగ్స్ ముగించింది. టీమిండియా స్పిన్ ద్వయం.. కుల్‌దీప్ యాదవ్ (5/72) చెలరేగగా.. వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్(4/51) బాల్‌తో మ్యాజిక్ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభమే దక్కింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 135 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (58 బంతుల్లో 57, 5×4, 3×6), రోహిత్ శర్మ (83 బంతుల్లో 52 నాటౌట్, 6×4, 2×6)లు అర్ధ శతకాలతో మెరిశారు. ప్రస్తుతం రోహిత్‌తో పాటు శుభ్‌మన్‌గిల్(26) క్రీజులో కొనసాగుతున్నారు.

బ్యాట్లెత్తేశారు..
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. భారత్ స్పిన్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కుల్దీప్ యాదవ్, అశ్విన్ చెలరేగడంతో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5, అశ్విన్ 4 పడగొట్టారు. రవీంద్ర జడేజాకే ఒక వికెట్ దక్కింది. ఇక.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు. డకెట్ (27), పోప్ (11), రూట్ (26), బెయిర్‌స్టో (29), స్టోక్స్ డకౌట్, ఫోక్స్ (24), హార్ట్లీ (6), షోయబ్ బషీర్ (11), వుడ్ డకౌట్, ఆండర్సన్ డకౌటయ్యారు.

బ్యాటింగ్‌లోనూ దూకుడే..
బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా బ్యాటంగ్‌లోనూ దూకుడుతో దూసుకుపోతోంది. టెస్టుల్లోనూ సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. పేసర్లు అండర్సన్, మార్క్ వుడ్‌తో తలా మూడు ఓవర్లు వేయించిన స్టోక్స్.. 7వ ఓవర్ నుంచి స్సిన్నర్లను బరిలోకి దించాడు. షోయబ్ బషీర్ వేసిన 10వ ఓవర్లో జైస్వాల్ మూడు సిక్సర్లు బాదాడు. రోహిత్ కూడా వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు.

బషీర్ వేసిన 15వ ఓవర్లోనే మూడో బంతికి ఫోర్ కొట్టడం ద్వారా జైస్వాల్.. టెస్టులలో వినోద్ కాంబ్లీ (14 ఇన్నింగ్స్) తర్వాత అత్యంత వేగంగా (16 ఇన్నింగ్స్‌లలో) వెయ్యి పరుగులు పూర్తిచేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. బషీర్ వేసిన 21వ ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టి అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న జైస్వాల్.. నాలుగో బంతికి స్టంపౌట్ అయ్యాడు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరూ సెంచరీ (104) భాగస్వామ్యం నెలకొల్పారు. కొద్దిసేపటికే రోహిత్ కూడా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News