Friday, November 15, 2024

ఉప్పల్‌లో భారత్‌దే పైచేయి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టీమిండియాకు టెస్టుల్లో కళ్లు చెదిరే రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన ఐదు టెస్టుల్లో భారత్ ఒక్కదాంట్లో కూడా ఓటమి పాలు కాలేదు. ఐదింటిలో టీమిండియా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఉప్పల్‌లో 2010లో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. భారత్‌ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది. 2012లో న్యూజిలాండ్‌తోనే భారత్ రెండో టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. 2013లో ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చటేశ్వర్ పుజారా డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక ఉప్పల్‌లో నాలుగో టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా 208 పరుగుల భారీ తేడాతో జయబేరి మోగించింది. ఈ టెస్టులో కోహ్లి డబుల్ సెంచరీ సాధించాడు. ఇక 2018లో వెస్టిండీస్‌తో ఉప్పల్ గడ్డపై భారత్ ఐదో టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ టీమిండియా పది వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఇక ఉప్పల్ స్టేడియంలో బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లి, చటేశ్వర్ పుజరాలకు ఎంతో కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక బౌలింగ్ విభాగంలో సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తిరుగులేని రికార్డు ఉంది. అశ్విన్ 8 ఇన్నింగ్స్‌లలో కలిపి 27 వికెట్లను పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్ 15 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలావుంటే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్‌ భారత్ జట్లు మధ్య మొదటి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ నగరలంలో క్రికెట్ సందడి నెలకొంది. ఇప్పటికే భారత్, ఇంగ్లండ్ జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News