Sunday, December 22, 2024

సిరీస్‌పై టీమిండియా కన్ను

- Advertisement -
- Advertisement -

డబ్లిన్: ఐర్లాండ్‌తో ఆదివారం జరిగే రెండో టి20కి టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఆతిథ్య ఐర్లాండ్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. తొలి టి20లో ఐర్లాండ్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. వర్షం వల్ల మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో డ/లూ పద్ధతిలో భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న భారత బౌలర్లు ప్రత్యర్థి టీమ్ ఐర్లాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. సుదీర్ఘ కాలం తర్వాత జట్టులోకి వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. ఆరంభ ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి ఐర్లాండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ఆరంగేట్రం బౌలర్ ప్రసిద్ధ్ కృష్ట కూడా మెరుగైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. రవి బిష్ణోయ్ కూడా చెలరేగడంతో ఐర్లాండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్ల ధాటికి ఐర్లాండ్ ఒక దశలో 31 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది.

అయితే కుర్టిస్ కాంఫెర్ (39), బారీ మెక్‌కార్తీ 51 (నాటౌట్) రాణించడంతో ఐర్లాండ్ 139 పరుగులకు చేరింది. తొలి మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్, ఓపెనర్ బాల్‌బిర్నీ ఈసారి మెరుగైన ఆరంభాన్ని ఇవ్వాలని భావిస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా భారత బౌలర్లకు కష్టాలు ఖాయం. అంతేగాక వికెట్ కీపర్ లొర్కాన్ టక్కర్, హారీ టెక్టర్, డాక్‌రెల్ తదితరులు కూడా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. కిందటి మ్యాచ్‌లో వీరు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ఐర్లాండ్ ఆశించిన స్థాయిలో పరుగులు సాధించలేక పోయింది. మరోవైపు మార్క్ అడైర్, మెక్‌కార్తీ, కాంఫెర్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో క్రెగ్ యంగ్ వెంటవెంటనే రెండు వికెట్లు తీయడం కూడా ఐర్లాండ్‌కు కలిసి వచ్చే అంశమే. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణిస్తేనే ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌కు గెలుపు అవకాశాలుంటాయి. లేకుంటే సిరీస్ చేజారడం ఖాయం.
ఫేవరెట్‌గా భారత్..
మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. కీలక ఆటగాళ్లు లేకుండానే సిరీస్ బరిలోకి దిగిన యువ భారత్ మొదటి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనతో అలరించింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, ప్రసిద్ధ్, అర్ష్‌దీప్, బిష్ణోయ్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియాకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News