Friday, December 20, 2024

ఎన్‌డిఎ X ‘ఇండియా’!

- Advertisement -
- Advertisement -

2024 లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే నడుం బిగించిన జాతీయ రాజకీయ కూటములు ఎన్‌డిఎ, ‘ఇండియా’ సమావేశాల సారాంశం తెలుసుకోదగినది. ఎన్‌డిఎ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) ఏకైక హీరో ప్రధాని నరేంద్ర మోడీ దేశ రాజధానిలో కొలువైన తమ కూటమి పార్టీల మొట్టమొదటి ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో తాము 50% ఓట్లను గెలుచుకొంటామని ప్రకటించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమికి 38%, 2019లో 45% ఓట్లు వచ్చాయని, 2024లో 50% తమకే పడనున్నాయని ప్రగల్భించారు. అంటే తమ ఓట్లు ఊర్ధముఖంగా పెరుగుతూ పోతాయే గాని తగ్గుముఖం పట్టవనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలోని 541 స్థానాల్లో 414 గెలుచుకొని అఖండ విజయాన్ని పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి (1989) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 197 స్థానాలే వచ్చిన సంగతీ ఎరుకే. అందుచేత ఏ పార్టీ లేదా కూటమి ఫలితాలు ఎల్లప్పుడూ పెరుగుతూ వుంటాయనే సూత్రం వాస్తవ విరుద్ధమైనది. ప్రధాని మోడీ తన పరిపాలనలో దేశంలో ఏమి జరుగుతున్నదో వాస్తవిక దృష్టితో తెలుసుకోగలిగితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 50% ఓట్లు తమవేనన్న ధీమా ప్రకటించి వుండేవారు కాదు.

ధరలు, నిరుద్యోగం, మత వైషమ్యాలు పెరిగి పేట్రేగుతున్న నేపథ్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వం స్వస్వరూప జ్ఞానాన్ని కోల్పోయినందు వల్లనే ప్రధాని ఇలా మితిమించిన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించగలుగుతున్నారు. మంగళవారం నాటి ఎన్‌డిఎ సమావేశంలో ప్రతిపక్షాలపై ఆయన తనకు బాగా అలవాటైన హావభావ విన్యాసాలతో విరుచుకుపడ్డారు. వారిది అవినీతిపరుల కూటమి అన్నారు. ఎన్‌డిఎ దేశానికి, అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పుకొన్నారు. ప్రతిపక్షాలు తమ మధ్య గల విభేదాలను పక్కన పెట్టి ఏకం కావడానికి, ఎన్‌డిఎ విద్వేష పాలనకు వ్యతిరేకంగా ఒకే వేదిక మీదికి రావడానికి గత అనేక మాసాలుగా చేస్తున్న కృషి ఒక కొలిక్కి వస్తుండడంతో ప్రధాని మోడీలో భయం చోటు చేసుకొన్నట్టు ఆయన ధోరణి స్పష్టం చేస్తున్నది.

ఎన్నడూ లేని విధంగా పాలక కూటమి సమావేశాన్ని ఆదరాబాదరాగా ఏర్పాటు చేయడంలోనే అది తెలుస్తున్నది. స్వయంగా తానే ప్రచార బాధ్యతలు వహించిన కర్ణాటక ఎన్నికల్లో తగిలిన దెబ్బకు ఆయనలో వణుకు పుట్టిందని అనుకోవాలి. ఓటమి పాలైన వారు భవిష్యత్తులో విజయాలు మూటగట్టుకోవాలంటే తమలోని లోపాలను తొలగించుకోడం ద్వారా ప్రజలకు మళ్ళీ చేరువ కాడానికి ప్రయత్నించాలి. అందుకు బదులుగా ఎప్పటి మాదిరిగానే ప్రత్యర్థులపై కారాలు, మిరియాలు నూరడానికే ప్రాధాన్యమిచ్చి గొంతు చించుకొంటే ఒరిగేదేమీ వుండదు. ఎందుకంటే ప్రధాని మోడీ ఉపన్యాస పటిమ దేశ ప్రజలకు కొత్త కాదు. తొమ్మిదేళ్ళ ఆయన పాలన తర్వాత ప్రజలు కోరుకొనేది ఆయన ప్రసంగ పాటవాన్ని కాదు. ఎంతో అప్పు చేసి, ప్రభుత్వ నిధులను విశేషంగా ఖర్చు చేసి ఆయన ప్రభుత్వం ఇన్నేళ్ళలో తమకు ఏమి చేసిందనే దానినే వారు శ్రద్ధగా పరిశీలిస్తారు. అయితే ప్రధాని వైఖరి ఎప్పటి మాదిరిగానే ఆత్మస్తుతి, పరనిందను తలపించింది. బెంగళూరులో జరిగిన ప్రతిపక్ష కూటమి రెండవ సమావేశానికి 26 పార్టీలు హాజరయ్యాయి. పాట్నాలో జరిగిన తొలి సమావేశంలో 16 పార్టీలే పాల్గొనగా ఆ సంఖ్య ఇప్పుడు 26కి చేరడం గమనించవలసిన విషయం.

అలాగే బెంగళూరు సమావేశంలో ఇవి సంకల్పం చెప్పుకొన్న లక్షాలు కూడా సమున్నతమైనవే. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా భారత దేశ భావనను కాపాడడానికి కృషి చేస్తామని, మైనారిటీలకు వ్యతిరేకంగా బిజెపి సాగిస్తున్న విష ప్రచారంపై పోరాటం చేస్తామని, మహిళలు, దళితులు, ఆదివాసీలు, కశ్మీర్ పండిట్లపై జరుగుతున్న నేరాలకు తెర దించుతామని, కులాల వారీ జనగణన జరిగేలా చూస్తామని బెంగళూరు సమావేశం ప్రతిజ్ఞ పూనింది. అలాగే తమ కూటమికి నామకరణం చేయడంలో కూడా సృజనాత్మక వైఖరిని అవలంబించింది. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ భారత జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమిగా పేరు పెట్టుకొన్నది. దీని ఆంగ్ల నామం ప్రకారం క్లుప్తంగా ఇది ఐ.ఎన్.డి.ఐ.ఎ అవుతుంది. కలిపి చదివితే ‘ఇండియా’ అని ఉచ్ఛరించక తప్పదు. తమ పోరాటం బిజెపి సిద్ధాంతం, దాని ఆలోచన విధానం పైనేనని, బిజెపిపైన కాదని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలో విజ్ఞత వుంది. పాలించే పార్టీ ఏదైనా దాని పాలనలో ప్రజల మధ్య విద్వేషాలు, ఆవేశకావేషాలు రగిలితే అందుకు ప్రతిఘటించి తీరాలి. అంతేగాని ఆ పార్టీపై ద్వేషంతో పని చేయరాదు. అంతిమంగా ప్రజల మధ్య ఐక్యత, వారి సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమైన లక్షాలుగా చేసుకొని పరిపాలన సాగాలి. బిజెపి పాలనలో దేశం అటువంటి వాటికి చాలా దూరమైన సంగతిని కాదనలేము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News