Friday, November 22, 2024

శివమెత్తిన మయాంక్

- Advertisement -
- Advertisement -

India vs New Zealand 2nd Test

రాణించిన గిల్, సాహా
 భారత్ 221/4
 కివీస్‌తో రెండో టెస్టు

ముంబై : న్యూజిలాండ్‌తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ప్రతికూల వాతావరణం వల్ల తొలి సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. అయితే లంచ్ తర్వాత ఆట ప్రారంభమైంది. తొలి రోజు ముగిసే సమయానికి భారత్ పటిష్టస్థితిలో నిలిచింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ జట్టుకు శుభారంభం అందించారు. చివర్లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడంతో భారత్ మ్యాచ్‌లో పటిష్టస్థితికి చేరుకుంది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో ఎజాజ్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

శుభారంభం..

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు మయా ంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్‌లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఇటు గిల్, అటు మయాంక్ మెరుగైన ఆటతో అలరించారు. ఈ జోడీని విడగొట్టేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ఇద్దరు దూకుడుగా ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్ 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో 80 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

పుజారా, కోహ్లి డకౌట్

ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన సీనియర్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా మరోసారి నిరాశ నిరాశ పరిచాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న పుజారా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఔటయ్యాడు. వాంఖడే స్టేడియంలో మంచి రికార్డు ఉన్న కోహ్లి కూడా నిరాశే మిగిల్చాడు. అతను కూడా సున్నాకే పెవిలియన్ చేరాడు. ఈ మూడు వికెట్లు కూడా ఎజాజ్ పటేల్‌కే దక్కాయి. దీంతో భారత్ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

కదం తొక్కిన మయాంక్

ఇలాంటి క్లిష్టమైన స్థితిలో జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తనపై వేసుకున్నాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ అండగా నిలిచాడు. కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన మయాంక్ స్కోరును పరిగెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలన్నీ వృథాగా మారాయి. వరుస ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి పోయిన పోయిన మయాంక్ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఇక శ్రేయస్ అయ్యర్ భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో ఆడాడు. తన వికెట్‌ను కాపాడుకుంటూ స్ట్రయిక్‌ను రొటేట్ చేశాడు. మయాంక్ మాత్రం దూకుడైన బ్యాటింగ్‌తో అలరించాడు. కాగా, మూడు ఫోర్లతో 18 పరుగులు చేసిన అయ్యర్‌ను కూడా ఎజాజ్ ఔట్ చేశాడు. దీంతో 80 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

సాహా అండతో..

అయ్యర్ ఔటైనా తర్వాత వచ్చిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అండతో మయాంక్ తన జోరును కొనసాగించాడు. కివీస్ బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును పరిగెత్తించాడు. ఈ జోడీని విడదీసేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు సాహా, అటు మయాంక్ కుదురుగా ఆడడంతో భారత్ మళ్లీ పైచేయి సాధించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మయాంక్ సెంచరీ సాధించాడు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన మయాంక్ 246 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, మరో 14 ఫోర్లతో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సాహా మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 25 పరుగులు చేసి అతనికి అండగా ఉన్నాడు. దీంతో భారత్ స్కోరు 221 పరుగులకు చేరింది.

ముగ్గురిపై వేటు

ఇక ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగింది. సీనియర్లు అజింక్య రహానె, ఇషాంత్ శర్మలకు తుది జట్టులో చోటు దక్కలేదు. రహానె స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టులోకి వచ్చాడు. ఇక ఇషాంత్‌కు బదులు యువ ఫాస్ట్ బౌలర్ సిరాజ్‌కు చోటు దక్కింది. మరోవైపు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో జయంత్ యాదవ్‌కు స్థానం కల్పించారు. న్యూజిలాండ్ కూడా కేన్ విలియమ్సన్ లేకుండా బరిలోకి దిగింది. దీంతో కివీస్‌కు టామ్ లాథమ్ సారథ్యం వహించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News