Monday, November 25, 2024

అజేయ భారతం

- Advertisement -
- Advertisement -

ముంబై: సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఇదే క్రమంలో కిందటిసారి ప్రపంచకప్‌లో కివీస్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో భారత్ భారీ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరును సాధించింది.

తర్వాత లక్షఛేదనకు దిగిన కివీస్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ అసాధారణ పోరాట పటిమతో అలరించింది.డారిల్ మిఛెల్ కళ్లు చెదిరే శతకంతో భారత బౌలర్లను హడలెత్తించాడు. కెప్టెన్ విలియమ్సన్ (69) అండతో మిఛెల్ చెలరేగి ఆడాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన మిఛెల్ 119 బంతుల్లోనే 7 భారీ సిక్సర్లు, మరో 9 ఫోర్లతో 134 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమి అసాధారణ బౌలింగ్‌ను కనబరిచాడు. చెలరేగి బౌలింగ్ చేసిన షమి 57 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కోహ్లి, శ్రేయస్ జోరు..
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 29 బంతుల్లోనే 4 సిక్స్‌లు, నాలుగు బౌండరీలతో 47 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన శుభ్‌మన్ గిల్ 8 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 80 పరుగులు సాధించాడు. ఇక చారిత్రక ఇన్నింగ్స్‌తో అలరించిన కోహ్లి 113 బంతుల్లోనే 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 117 పరుగులు చేశాడు. మరోవైపు చెలరేగి ఆడిన శ్రేయస్ అయ్యర్ 70 బంతుల్లోనే 8 భారీ సిక్స్‌లు, 4 ఫోర్లతో 105 పరుగులుసాధించాడు. రాహుల్ 39 (నాటౌట్) కూడా దూకుడుగా ఆడడంతో భారత్ స్కోరు 397 పరుగులకు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News