Saturday, September 21, 2024

భారమంతా రహానే, విహారీ పైనే

- Advertisement -
- Advertisement -

India vs Newzealand

 

రెండో ఇన్నింగ్స్‌లోను విఫలమైన టీమిండియా టాప్ ఆర్డర్
4 వికెట్ల నష్టానికి 144 పరుగులు

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమికి ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 165 పరుగులకే కుప్పకూలిన కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్‌లోను చేజేతులా వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ లోటు 183 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఇంకా 39 పరుగుల వెనుకంజలో కోహ్లీ సేన ఉంది. ప్రస్తుతం అజింక్యా రహానే (25), హనుమ విహారి (5) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (58) మినహా పృథ్వీషా (14),పుజారా (11), విరాట్ కోహ్లీ(19)లు ట్రెంట్ బౌల్ట్ ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో నాలుగో రోజు రహానే, విహారిలతో పాటుగా రిషబ్ పంత్‌ల బ్యాటింగ్‌పైనే భారత్ టెస్టును కాపాడుకోవడం ఆధారపడి ఉంది.

తీరు మారని టాప్ ఆర్డర్
పరువుకోసం పోరాడాల్సిన పరిస్థితుల్లో టీమిండియా టాపార్డర్ నిర్లక్షంగా ఆడి వికెట్లు చేజార్చుకుంది. ముందుగా ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబాటు పడిన పృథ్వీషా వికెట్ పారేసుకున్నాడు. ఓ వైపు మయాంక్ అగర్వాల్ పోరాడుతుండగా.. పుజారా క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే టీ విరామ సమయానికి ముందు పుజారా బౌల్ట్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి తీవ్ర నిరాశపరిచాడు. అర్ధ సెంచరీతో మంచి ఊపు మీదున్నట్లు కనిపించిన అగర్వాల్ టిమ్ సౌతీ వేసిన లెగ్‌సైడ్ బంతిని అనవసరంగా వెంటాడి మరీ వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.

మూడు బౌండరీలు కొటి ఆ్టత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపించిన సారథి కోహ్లీ బౌల్ట్ వేసిన షార్ట్‌పిచ్ బంతిని ఆడబోయి ఔటయ్యాడు. దీంతో 113 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే రహానే, విహారిలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో పాటుగా రిషబ్ పంత్ మెరుపులు మెరిపిస్తే తప్ప టీమిండియా మ్యాచ్‌ను కాపాడుకోవడం, లేదా గెలవడం సాధ్యపడవు. మరి నాలుగో రోజు టీమిండియా ఏం చేస్తుందో వేచి చూడాలి.

జేమిసన్, బౌల్ట్ మెరుపులు
51 పరుగుల ఆధిక్యంతో ఓవర్‌నైట్ స్కోరు 216/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో రోజు వేసిన తొలి బంతికే వాట్లింగ్ (14)ను ఔట్ చేసిన బుమ్రా టీమిండియా శిబిరంలో ఆనందం నింపాడు. అనంతరం టిమ్ సౌతీ(6) కూడా క్రీజ్‌లో ఎక్కువ సేపు నిలవలేదు. సౌతీని ఇశాంత్ బోల్తా కొట్టించాడు. అయితే ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జేమిసన్ ఆట తీరును మార్చేశాడు. ఓ వైపు గ్రాండ్‌హోమ్ క్రీజ్‌లో నిలదొక్కుకోగా అతను బౌండరీల వర్షం కురిపించాడు.

కేవలం 45 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 44 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం గ్రాండ్‌హోమ్(43)ను కూడా అశ్విన్ బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో క్రీజ్‌లోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు.కేవలం 24 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 38 పరుగులు చేసి కివీస్‌కు కావాల్సిన ఆధిక్యతను అందించడంతో పాటు టీమిండియాకు చేయాల్సినంత నష్టాన్ని చేసి ఔటయ్యాడు. దీంతో కివీస్ 348 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ఇశాంత్ శర్మ (5/68), అశ్విన్ (3/99) రాణించగా, షమీ,బుమ్రా చెరో వికెట్ తీశారు.

India vs Newzealand 1st test match updates
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News