Friday, November 15, 2024

ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ఆస్పత్రి బెడ్స్: అహ్మదాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పూనకాలు వస్తాయి. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ రెండు జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌ను రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం స్థాయిలో వీక్షిస్తారు. అక్టోబర్ 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే..ప్రత్యక్షంగా ఈ మ్యాచ్‌ను తిలకించాలని ఆశపడుతున్న అభిమానులకు అహ్మదాబాద్‌లో హోటల్ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని నగరంలోని హోటళ్లు తమ రూమ్ బుకింగ్ రేట్లను అమాంతం పెంచేశాయి. ఆ రేట్లు వింటే ఎవరికైనా గుండె గుభేల్ మనడం ఖాయం.

ఐసిసి వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అహ్మదాబాద్‌లోని హోటళ్ల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. అక్టోబర్ 15వ తేదీ ప్రాంతంలో గదుల కోసం వచ్చే అడ్వాన్స్ బుకింగ్‌ల విషయంలో తొందరపడకూడదన్న నిర్ణయంతో నోరూమ్ అవైలబుల్ అని హోటల్స్ ముందుగానే చెప్పేస్తున్నాయి. భరించదగ్గ స్థాయిలో ఏవైనా హోటల్ గదులు దొరుకుతాయన్న ఆశతో ముందుగానే అడ్వాన్స్ చేసుకోవాలని భావిస్తున్న క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. కొన్ని హోటళ్ల రూము ధరలు రూ. 1.5 లక్షలకు చేరుకున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత ఖరీదు పెట్టి హోటల్ గదిని ఎలా పొందాలో అర్థంకాక సామాన్యులు దిగాలు పడుతున్నారు.

అయితే క్రికెట్ కామెంటేటర్ ముఫద్దల్ వోహ్రా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక ఆసక్తికర విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. అహ్మదాబాద్‌లో హోటల్ రూములు దొరకని వారు ఆసుపత్రి బెడ్స్‌ను అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇది వింతగా అనిపిస్తున్నప్పటికీ హోటల్‌లో రూము ధరలతో పోలిస్తే ఆసుపత్రి బెడ్స్ చవకగా ఉండడమే ఇందుకు కారణం. ఆసుపత్రులలో బెడ్స్ కోసం పెద్ద సంఖ్యలో అడ్వాన్స్ బుకింగ్‌లు రావడం చూసి ఆసుపత్రి యాజమాన్యాలు సైతం అవాక్కవుతున్నాయట. ఏదేమైనా క్రికెట్‌పై అభిమానం ఎలాంటి ప్రయత్నానికైనా పురిగొల్పుతుందని దీన్ని బట్టి అర్థమవుతోంది.

అయితే..హోటల్స్‌లో రూములకు డిమాండ్ ఏర్పడడం కేవలం అహ్మదాబాద్‌కే పరిమితం కాలేదు. చుట్టుపక్కల దగ్గరలో ఉన్న ఇతర నగరాలలో సైతం ఇప్పటి నుంచే హోటల్ బుకింగ్స్ మొదలయ్యాయట. అహ్మదాబాద్ నుంచి కేవలం గంట ప్రయాణం చేస్తే వచ్చే వడోదరలో కూడా హోటల్ రూము రేట్లు అమాతం ఆరు నుంచి ఏడు రెట్లు పెరిగినట్లు తెలుసోంది. క్రికెట్ మ్యాచ్‌కు ఇంకా మూడు నెలల వ్యవధి ఉన్నందువల్ల రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేమని క్రికెట్ అభిమానులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News