Wednesday, January 22, 2025

నేడు భారత్‌-సౌతాఫ్రికా చివరి వన్డే

- Advertisement -
- Advertisement -

పార్ల్: భారత్‌ దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం మూడో, చివరి వన్డే జరుగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 11తో సమంగా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రెండో వన్డేలో ఆతిథ్య సౌతాఫ్రికా జయకేతనం ఎగుర వేసింది. దీంతో మూడో వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇందులో గెలిచే జట్టుకు సిరీస్ దక్కుతోంది. ఈ పరిస్థితుల్లో ఇటు సౌతాఫ్రికా, అటు భారత్ విజయమే లక్షంగా పోరుకు సిద్ధమయ్యాయి. తొలి వన్డేలో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన టీమిండియా కిందటి మ్యాచ్‌లో ఆ జోరును కనబరచలేక పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ అర్ధ సెంచరీలతో అదరగొట్టాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

సంజు శాంసన్, రింకు సింగ్, తిలక్‌వర్మ, కెప్టెన్ కెఎల్ రాహుల్‌లతో భారత బ్యాటింగ్ బలంగా ఉంది. అయితే కిందటి మ్యాచ్‌లో బ్యాటర్లు విఫలమయ్యారు. ఇలాంటి స్థితిలో మూడో వన్డేలో బ్యాటర్లు ఎలా ఆడుతారనేది ఆందోళన కలిగిస్తోంది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత రాహుల్‌పై నెలకొంది. రుతురాజ్, శాంసన్‌లు కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. ఇక బౌలింగ్‌లో భారత్ బాగానే ఉంది. అర్ష్‌దీప్, అక్షర్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, కుల్దీప్‌లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. ఈసారి కూడా బౌలర్లు జట్టుకు కీలకంగా మారారు. మరోవైపు ఆతిథ్య సౌతాఫ్రికా కూడా జోరుమీదుంది. కిందటి మ్యాచ్‌లో ఓపెనర్లు రీజా హెండ్రిక్స్, టోనీ జోర్జీలు అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. జోర్జీ కళ్లు చెదిరే సెంచరీతో అదరగొట్టాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. డుస్సెన్, కెప్టెన్ మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్‌లతో సౌతాఫ్రికా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News