Wednesday, January 22, 2025

సమరోత్సాహంతో భారత్.. నేడు సౌతాఫ్రికాతో తొలి టీ20

- Advertisement -
- Advertisement -

డర్బర్: భారత్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఆదివారం డర్బన్ వేదికగా తొలి టి20 జరుగనుంది. సీనియర్ ఆటగాళ్లు లేకుండానే భారత్ ఈసారి బరిలోకి దిగుతోంది. సౌతాఫ్రికా మాత్రం కీలక ఆటగాళ్లందరిని సిరీస్‌కు ఎంపిక చేసింది. టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఐడెన్ మార్‌క్రమ్ వ్యవహరించనున్నాడు. సొంత గడ్డపై సిరీస్ జరుగుతుండడంతో సౌతాఫ్రికా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియాకు జోరుమీదుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కుర్రాళ్లతో నిండిన భారత్ అదరగొట్టింది. పటిష్టమైన ఆసీస్‌పై 41 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీంతో సౌతాఫ్రికా సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు.

యసశ్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, జడేజా, జితేష్ శర్మ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కిందటి సిరీస్‌లో రుతురాజ్, యశస్వి, కెప్టెన్ సూర్యకుమార్, రింకు సింగ్‌లు అద్భుతంగా రాణించారు. ఈ సిరీస్‌లో కూడా అదేజోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. టి20లలో కళ్లు చెదిరే రికార్డు కలిగిన సూర్యకుమార్ జట్టును ముందుండి నడిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. సూర్య తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం. రింకు సింగ్ రూపంలో మరో విధ్వంసక బ్యాటర్ జట్టులో ఉన్నాడు. దూకుడైన బ్యాటింగ్‌కు మరో పేరుగా మారిన రింకు ఈసారి మరింత మెరుగైన బ్యాటింగ్‌ను పరచాలనే పట్టుదలతో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ చేరికతో బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారింది. ఇక సిరాజ్, అర్ష్‌దీప్, ముకేశ్ కుమార్, కుల్దీప్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్, జడేజాలతో బౌలింగ్ విభాగం కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియాకు కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.

ఫేవరెట్‌గా..
మరోవైపు ఆతిథ్య సౌతాఫ్రికా ఈ సిరీస్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సఫారీ టీమ్ సమతూకంగా కనిపిస్తోంది. మార్‌క్రమ్, హెండ్రిక్స్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మాథ్యూ బిట్జ్‌కె, కేశవ్ మహారాజ్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అంతేగాక కొయేట్జి, జాన్సెన్, షంసి వంటి మ్యాచ్ విన్నర్‌లు కూడా జట్టులో ఉన్న విషయం తెలిసిందే. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం సౌతాఫ్రికాకు మరింత కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News