కొలంబో: ప్రతిష్ఠాత్మకమైన ఆసియాకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే తుది పోరులతో భారత్‌తో శ్రీలంక అమీతుమీ తేల్చుకోనుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఓటమి పాలు కావడంతో టీమిండియాపై ఒత్తిడి నెలకొంది. ఇక సొంత గడ్డపై ఆడుతున్న శ్రీలంక చివరి మ్యాచ్‌లో బలమైన పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయం సాధించి తుది పోరుకు దూసుకొచ్చింది. ఈ విజయం లంక ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. దీనికి తోడు సొంత అభిమానుల మధ్య పోరు జరుగుతుండడం కూడా లంకకు కలిసివచ్చే అంశంగా మారింది. అయితే కీలక ఆటగాడు మహీశ్ తీక్షణ గాయంతో జట్టుకు దూరం కావడం లంకకు కాస్త ఇబ్బందికరంగా మారింది.
కానీ అతను లేకున్నా లంకలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. భారత్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో లంక యువ సంచలనం దునిత్ వెల్లలాగే అసాధారణ ఆటతో అలరించాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక అసలంక, కుశాల్ మెండిస్, నిసాంకా, కరుణరత్నె, సమరవిక్రమ, ధనంజయ డిసిల్వా, శనక తదితరులతో లంక బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. పాకిస్థాన్‌పై లంక బ్యాటర్లు అసాధారణ ఆటను కనబరిచారు. భారత్‌పై కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. బౌలింగ్‌లో కూడా లంక పటిష్టంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో లంక భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది.
తేలికేం కాదు..
మరోవైపు టీమిండియాకు ఫైనల్ సమరం తేలికేం కాదనే చెప్పాలి. బంగ్లాదేశ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయింది. బౌలర్లు కీలక సమయంలో వికెట్లను తీయడంలో విఫలమయ్యారు. దీంతో బంగ్లాదేశ్ భారీ స్కోరును నమోదు చేసింది. ఇక బ్యాటింగ్‌లో కూడా టీమిండియా విఫలమైంది. ఒక్క శుభ్‌మన్ గిల్ మాత్రమే అద్భుత ఆటను కనబరిచాడు. కళ్లు చెదిరే శతకంతో జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. కానీ ఇతర ఆటగాళ్లు విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. కనీసం ఫైనల్ మ్యాచ్‌లోనైనా భారత బ్యాటర్లు నిలకడైన ఆటను కనబరచాల్సిన అవసరం ఉంది. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి.