Monday, December 23, 2024

నేడు శ్రీలంకతో ఆసియా కప్ ఫైనల్

- Advertisement -
- Advertisement -

మహిళల ఆసియాకప్ ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగే తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఆతిథ్య జట్టు శ్రీలంకతో తలపడనుంది. భారత్, శ్రీలంకలు లీగ్ దశలో అజేయంగా నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ ఘణ విజయం సాధించింది. ఇక పాకిస్థాన్‌తో జరిగిన మరో సెమీస్‌లో శ్రీలంక అతి కష్టం మీద గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఓపెనర్ షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, హేమలత, పూజా వస్త్రకర్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. ఓపెనర్లు మంధాన, షఫాలీలు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఇద్దరు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఈసారి కూడా వీరి నుంచి మెరుగైన ఆరంభాన్ని జట్టు ఆశిస్తోంది. మంధాన సెమీస్‌లో కీలక ఇన్నింగ్స్‌తో అలరించింది. లంకపై కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమైంది. షఫాలీ కూడా జోరుమీదుంది.

వీరిద్దరూ తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే భారత్‌కు మరోసారి శుభారంభం ఖాయం. ఇక హర్మన్‌ప్రీత్, జెమీమా, హేమలతలకు కూడా దూకుడు మీద ఉన్నారు. హర్మన్‌ప్రీత్ జట్టును ముందుండి నడిపించేందుకు తహతహలాడుతోంది. జెమీమా కూడా బ్యాట్‌ను ఝులిపించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో చాలా బలంగా ఉన్న టీమిండియా బౌలింగ్‌లో కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. ఆసియా కప్‌లో భారత బౌలర్లు సమష్టి ప్రతిభతో జట్టును గెలిపిస్తున్నారు. రేణుకా సింగ్ అద్భుత బౌలింగ్‌తో అలరిస్తోంది. టీమిండియాను ఫైనల్‌కు చేర్చడంలో రేణుకా పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. ఎలాంటి బ్యాటింగ్ లైనప్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా ఆమెకు ఉంది. ఫైనల్ పోరులో రేణుకా సింగ్ జట్టుకు కీలకంగా మారింది. ఇక దీప్తి శర్మ కూడా మెరుగైన బౌలింగ్‌ను కనబరుస్తోంది. ప్రతి మ్యాచ్‌లోనూ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయంలో వికెట్లను తీస్తూ జట్టుకు అండగా నిలుస్తోంది. పూజా వస్త్రకర్, తనుజా కన్వర్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ తదితరులు కూడా అద్భుత బౌలింగ్‌ను కనబరుస్తారు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

ఆత్మవిశ్వాసంతో లంక..
మరోవైపు ఆతిథ్య శ్రీలంక జట్టు కూడా ఆత్మవిశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. కెప్టెన్ చమరి అటపట్టు అద్భుత ఫామ్‌లో ఉంది. శ్రీలంకను ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చింది. భారత్‌పై కూడా చెలరేగేందుకు అటపట్టు సిద్ధమైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అటపట్టు విజృంభిస్తే భారత బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. ఓపెనర్ విశ్మి, హర్షిత, కవిశా దిల్హారి, నీలాక్షి డి సిల్వా, హసిని పెరీరా, అనుష్క సంజీవని తదితరులతో లంక చాలా బలంగా ఉంది. బౌలింగ్‌లోనూ లంక బలంగానే ఉంది. ప్రభోదని, ప్రియదర్శిని, అచిని కులసూర్య, అటపట్టు, కవిశా వంటి ప్రతిభావంతులైన బౌలర్లు జట్టులో ఉన్నారు. ఇక సొంత గడ్డపై పోరు జరుగుతుండడం కూడా లంకకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News