Thursday, January 23, 2025

గెలిచే వారిదే సిరీస్

- Advertisement -
- Advertisement -

ట్రినిడాడ్ : వెస్టిండీస్‌తో మంగళవారం జరిగే మూడో, చివరి వన్డే టీమిండియాకు పరీక్షగా మారింది. రెండో వన్డేలో అనూహ్య విజయం సాధించిన ఆతిథ్య వెస్టిండీస్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు కిందటి మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా ఈసారి కూడా ప్రయోగాలు చేయాలనే ఉద్దేశంతో టీమిండియా యాజమాన్యం ఉంది. చివరి వన్డేలో కూడా సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు కూడా విశ్రాంతి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ మ్యాచ్‌కు మరోసారి హార్దిక్ పాండ్య సారథ్యం వహించడం ఖాయం. వన్డే ప్రపంచకప్ మరి కొంత సమయం మాత్రమే మిగిలివున్న నేపథ్యంలో రిజర్వ్‌బెంచ్ ఆటగాళ్లను పరీక్షించేందుకే బిసిసిఐ మొగ్గు చూపుతోంది. ఇందులో భాగంగానే తొలి రెండు వన్డేల్లో పలు ప్రయోగాలకు వెనుకాడలేదు. చివరి వన్డేలోనూ ఇలాంటి విధానాన్ని అవలంభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఓపెనర్లే కీలకం..
ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌లు కీలకంగా మారారు. ఇషాన్ తొలి రెండు వన్డేల్లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. రెండు మ్యాచుల్లోనూ అర్ధ సెంచరీలతో అలరించాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇషాన్ చెలరేగితే టీమిండియాకు శుభారంభం ఖాయం. ఇక గిల్ కూడా మెరుగైన ప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న గిల్ తన మార్క్ బ్యాటింగ్‌తో రాణిస్తే విండీస్ బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. మరోవైపు రెండో వన్డేలో విఫలమైన సంజూ శాంసన్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య తదితరులకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. రానున్న ప్రపంచకప్‌లో చోటు కాపాడుకోవాలంటే చివరి వన్డేలో రాణించాల్సిన పరిస్థితి ఈ ఆటగాళ్లకు నెలకొంది.

ముఖ్యంగా సూర్యకుమార్, అక్షర్‌లకు ఇది చాలా కీలకంగా తయారైంది. సూర్యకుమార్‌కు వరుస అవకాశాలు లభిస్తున్నా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోలేక పోతున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బ్యాట్‌ను ఝులిపించాల్సిన అవసరం ఉంది. బౌలర్లు కూడా మెరుగైన ప్రదర్శన చేయక తప్పదు. హార్దిక్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్, ఉనద్కట్, శార్దూల్, కుల్దీప్, చాహల్ తదితరులతో బౌలింగ్ బాగానే ఉంది. అయితే కిందటి మ్యాచ్‌లో బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. కీలకమైన ఈ మ్యాచ్‌లో బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేస్తేనే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News