Saturday, December 21, 2024

టీమిండియాకు సవాల్ వంటిదే..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం : వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. కొంత కాలంగా విండీస్‌తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ వరుస విజయాలు సాధిస్తున్నా ఈసారి మాత్రం గెలుపు అంత తేలికకాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంతో పోల్చితే టెస్టుల్లో విండీస్ కాస్త బలంగా కనిపిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమవుతున్న విండీస్ టీమ్ సంప్రదాయ టెస్టులకు వచ్చే సరికి కాస్త బాగానే ఆడుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు ఈ సిరీస్ అనుకున్నంత తేలిక కాదని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్లూటిసి ఫైనల్లో భారత్ తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయింది. బ్యాటింగ్ వైఫల్యంతో భారత్‌కు ఈ ఫైనల్లో ఓటమి తప్పలేదు. డబ్లూటిసి ఫైనల్లో అజింక్య రహానే మినహా మిగతా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఇలాంటి స్థితిలో విండీస్‌తో జరిగే సిరీస్‌లో బ్యాటర్లు ఎలా ఆడుతారనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. బౌన్స్‌కు సహకరించే విండీ స్ పిచ్‌లపై మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడం భారత్‌కు సులువేమీ కాదనే చెప్పాలి.

చటేశ్వర్ పుజారా వంటి సీనియర్ ఆటగాడి సేవలు ఈసారి జట్టుకు అందుబాటులో లేవు. ఇది కూడా జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా విండీస్ టీమ్‌లో ప్రతిభావంతులైన ఫాస్ట్ బౌలర్లకు కొదవలేదు. వారిని ఎదుర్కొన్ని భారీ స్కోర్లు సాధించడం బ్యాటర్లకు అంత తేలికేం కాదు. ఇక ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లి, అజింక్య రహానె, కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా తదితరులు జట్టుకు చాలా కీలకంగా మారారు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ రోహిత్ శర్మపై నెలకొంది. డబ్లూటిసి ఫైనల్లో రోహిత్ ఇటు బ్యాటర్‌గా అటు కెప్టెన్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. అయితే విండీస్ సిరీస్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలన్నదే అతను లక్షంగా పెట్టుకున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కోహ్లి, రహానె, గిల్, యశస్వి, భరత్ తదితరులు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిస్తే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి.

ఫేవరెట్‌గా బరిలోకి..
ఇదిలావుంటే ఈ సిరీస్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. విండీస్‌తో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. సమష్టిగా రాణిస్తే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాదు. కాగా, ఈ సిరీస్‌ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. విండీస్‌ను ఓడించడం ద్వారా తిరిగి గాడిలో పడాలని భావిస్తోంది. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో భారత జట్టు బలంగా ఉంది. మరోవైపు బలమైన టీమిండియాకు విండీస్ ఏ మేరకు పోటీ ఇస్తుందో చెప్పలేం. భారత్‌తో పోల్చితే అన్ని విభాగాల్లో విండీస్ బలహీనంగా కనిపిస్తోంది. అయితే సొంత గడ్డపై ఆడుతుండడం ఒక్కటే విండీస్‌కు సానుకూల పరిణామంగా చెప్పాలి. విండీస్ సిరీస్‌లో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మరో ఐదు టి20 మ్యాచ్‌లు ఆడనుంది.

నేటి నుంచి విండీస్‌తో తొలి టెస్టు
భారత్‌వెస్టిండీస్ జట్ల బుధవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. డొమినికాలోని విన్‌సర్ పార్క్ గ్రౌండ్ ఈ మ్యాచ్‌కు వేదికగా నిలువనుంది. భారత్ సీనియర్‌జూనియర్ ఆటగాళ్ల కలయికతో బరిలోకి దిగుతోంది. విండీస్‌లో మాత్రం చాలా వరకు కొత్త ముఖాలే ఉన్నాయి. భారత్‌కు రోహిత్ శర్మ, విండీస్‌కు క్రెగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.భారత్ తరఫున రోహిత్, శుభ్‌మన్ గిల్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్, సీనియర్లు విరాట్ కోహ్లి, అజింక్య రహానెలకు తుది జట్టులో ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. రవీంద్ర జడేజా కూడా తుది జట్టులో ఉండడం ఖాయం. అయితే రవిచంద్రన్‌కు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది సందేహంగా మారింది. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను ఆడించినా ఆశ్చర్యం లేదు. సిరాజ్, నవ్‌దీప్ సైనీ, ఉనద్కట్‌లకు తుది జట్టులో స్థానం లభించే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి సీనియర్లు కోహ్లి, రహానెలపైనే నిలిచింది. వీరు ఎలా ఆడతారనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్, శ్రీకర్ భరత్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిలో ఎవరినీ తీసుకోవాలనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.

జట్ల వివరాలు
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అశ్విన్, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శార్దూల్, నవ్‌దీప్ సైనీ, ముకేశ్ కుమార్, మహ్మద్ సిరాజ్, ఉనద్కట్.
వెస్టిండీస్ : బ్రాత్‌వైట్ (కెప్టెన్), బ్లాక్‌వుడ్, అలిక్, త్యాగ్‌నారాయణ్ చంద్రపాల్, జోషువా (వికెట్ కీపర్), రఖీమ్ కార్న్‌వాల్, జేసన్ హోల్డర్, రేమన్ రిఫర్, క్రికెట్ మెకంజీ, కేమర్ రోచ్, అల్జరీ జోసెఫ్, షన్నాన్ గాబ్రియల్, జోమేల్ వారికాన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News