Monday, December 23, 2024

ఓపెనర్లే కీలకం..

- Advertisement -
- Advertisement -

గయానా: వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే రెండో టి20 మ్యాచ్ భారత్‌కు కీలకంగా మారింది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన ఆతిథ్య వెస్టిండీస్ ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి సిరీస్‌లో మరింత మెరుగైన స్థితికి చేరుకోవాలని భావిస్తోంది. ఇక యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన టీమిండియా తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడింది. బౌలింగ్‌కు సహకరించిన పిచ్‌పై భారత్ స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పోయింది. అయితే ఈసారి మాత్రం విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది.

తొలి టి20లో విఫలమైన ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు ఈ మ్యాచ్‌లోనైనా జట్టుకు శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న గిల్, ఇషాన్‌లలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా ప్రత్యర్థి టీమ్ బౌలర్లకు కష్టమే. వన్డేల్లో వీరిద్దరూ మెరుగైన ఆటను కనబరిచిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన నాలుగు మ్యాచుల్లో కూడా ఓపెనర్లు జట్టుకు కీలకంగా మారారు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, కెప్టెన్ హార్దిక్ పటేల్ తదితరులు కూడా బ్యాట్‌ను ఝులిపించక తప్పదు. తొలి మ్యాచ్‌లో తిలక్‌వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. సీనియర్లు సూర్యకుమార్, హార్దిక్, అక్షర్, శాంసన్‌లు జట్టును ముందుండి నడిపించక తప్పదు. మొదటి మ్యాచ్‌లో కీలక బ్యాటర్లు విఫలం కావడంతో సునాయాస లక్ష్యాన్ని కూడా భారత్ ఛేదించలేక పోయింది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలని జట్టు భావిస్తోంది. బౌలింగ్‌లో మాత్రం టీమిండియా మెరుగ్గానే ఉంది. తొలి టి20లో బౌలర్లు సమష్టిగా రాణించి విండీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఈసారి కూడా సత్తా చాటేందుకు బౌలర్లు సిద్ధమయ్యారు. అర్ష్‌దీప్, ముకేశ్ కుమార్, చాహల్, కుల్దీప్, హార్దిక్, అక్షర్ తదితరులతో భారత బౌలింగ్ బలంగా ఉంది. సమష్టిగా రాణిస్తేనే విండీస్‌ను మరోసారి తక్కువ స్కోరుకే పరిమితం చేసే ఛాన్స్ ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News