Monday, December 23, 2024

విండీస్‌పై భారత్‌దే పైచేయి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ క్రీడా విభాగం : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్ టెస్ట్ సిరీస్ జరగనుంది. అందులో తొలి టెస్టు బుధవారం నుంచి డొమినికా వేదికగా ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఐదు రోజులపాటు తీవ్ర సాధన చేసిన టీమిండియా ఇప్పుడు ఆతిథ్య జట్టుతో కుస్తీకి సిద్ధమైంది. కాగా, విండీస్ గడ్డపై టెస్టుల్లో భారత్ గణంకాలు ఎలా ఉన్నాయో చూద్దాం. గత కొన్నేళ్లుగా వెస్టిండీస్‌పై టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. గత 21 ఏళ్లుగా భారత్‌ను ఓడించడంలో విండీస్ జట్టు విఫలప్రయత్నం చేసింది. టీమిండియా ఇప్పటి వరకూ కరేబియన్ గడ్డపై ఆతిథ్య జట్టుతో 51 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 16 టెస్టుల్లో ఓడిపోగా, 26 టెస్టుల్లో ఫలితం తేలలేదు.
వరుసగా ఎనిమిది టెస్టు సిరీస్‌లు..
1952లో తొలిసారి వెస్టిండీస్‌లో పర్యటించిన టీమిండియా 1970లో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. అప్పటి నుంచి, టీమిండియా వెస్టిండీస్‌లో 12 టెస్ట్ సిరీస్‌లు ఆడింది, అక్కడ అది 5 గెలిచి, 7 సిరీస్‌లను చేజార్చుకుంది. ఇక చివరిసారిగా 2002లో వెస్టిండీస్‌పై భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత ఆతిథ్య జట్టుపై టీమిండియా ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోలేదు. 2002 సంవత్సరం నుంచి, టీమిండియా, వెస్టిండీస్ మధ్య 8 టెస్ట్ సిరీస్‌లు జరిగాయి. వీటిలో 4 టెస్టు సిరీస్‌లు భారత్‌లో ఆడగా, అదే సంఖ్యలో వెస్టిండీస్‌లో ఆడారు. మొత్తం ఎనిమిది టెస్టుల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. 2002 అక్టోబరు నుంచి విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ అజేయంగా నిలిచింది. 2002, 2006, 2011, 2011, 2013, 2016, 2018, 2019లో టీమిండియా వరుసగా విజయాలు నమోదు చేసింది. భారత్ చివరిసారిగా 2019లో విండీస్‌లో పర్యటించగా.. ప్రస్తుతం వెస్టిండీస్‌పై టీమిండియాదే పైచేయి అని చెప్పవచ్చు.
సమతూకంగా టీమిండియా..
కాగా, ప్రస్తుతం విండీస్ జట్టులో ఆటగాళ్లంతా ఫాంలేమితో సతమతమవుతుండటం, విండీస్ బోర్డు రాజకీయాలు, కరేబియన్ ఆటగాళ్లు టి20 వైపు మొగ్గు చూపడం వెస్టిండీస్ క్రికెట్‌ను కోలుకోకుండా చేస్తున్నాయి. అంతేకాకుండా కరీబియన్ ఆటగాళ్ల బోర్డుతో జీతాల వివాదం కూడా జట్టును అతలాకుతలం చేస్తోంది. ఇక ఇప్పుడు టీమిండియా చాలా పటిష్టంగా, సమపాళ్లలో కనిపిస్తోంది. దీంతో భారత్ విండీస్‌తో సిరీస్ గెలుపొందడం సులువనే చెప్పొచ్చు. టీమిండయా అనుభవం గల యువ ఆటగాళ్లతో నిండి ఉంది. అందులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లు ఉండనే ఉన్నారు. యశస్వికి తొలిసారిగా టీమిండియాలో చోటు దక్కిడం, రితురాజ్ గైక్వాడ్ కూడా తనదైన ముద్ర వేయాలని తహతహలాడుతుండటటం జట్టుకు కలిసొచ్చే అంశాలని చెప్పొచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అజింక్యా రహానె వంటి సీనియర్లతో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. దీంతో ఆతిధ్య జట్టుకు పెద్ద సవాలనే చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News