Saturday, October 5, 2024

నేడు జింబాబ్వేతో తొలి టి20 మ్యాచ్.. కుర్రాళ్లు రాణించేనా?

- Advertisement -
- Advertisement -

హరారే: జింబాబ్వేతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. శనివారం ఇరు జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ప్రపంచకప్‌లో ఆడిన సీనియర్లకు, ఇతర క్రికెటర్లకు ఈ సిరీస్‌లో విశ్రాంతి కల్పించారు. గిల్ నేతృత్వంలో దాదాపు పూర్తిగా కొత్త జట్టే సిరీస్‌లో బరిలోకి దిగుతోంది.

మరోవైపు జింబాబ్వే పూర్తి స్థాయి జట్టుతో సిరీస్‌కు సిద్ధమైంది. ఆతిథ్య జట్టుకు సీనియర్ ఆల్‌రౌండర్ సికందర్ రజా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్ పూర్తిగా యువ ఆటగాళ్లతో నిండివుంది. గిల్ తప్ప సీనియర్లు ఎవరూ జట్టులో లేరనే చెప్పాలి. ఇలాంటి స్థితిలో భారత్ ఎలా ఆడుతుందనే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కెప్టెన్ గిల్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక ఐపిఎల్‌లో మెరుపులు మెరిపించిన ఆటగాళ్లకు సిరీస్‌లో చోటు కల్పించారు. గిల్‌తో పాటు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురెల్, జితేస్ శర్మ, రింకు సింగ్, సుందర్‌లు జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.

రుతురాజ్, అభిషేక్‌లు ఐపిఎల్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ గిల్‌తో కలిసి రుతురాజ్, అభిషేక్‌లలో ఎవరూ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. సీనియర్లు లేకున్నా యువ క్రికెటర్లతో కూడిన భారత్‌ను తక్కువ అంచనా వేయలేం. ఐపిఎల్‌లో ఆడిన అనుభవం ఆటగాళ్లకు సానుకూలంగా మారనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. ప్రతిభావంతులైన బ్యాటర్లు, బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇక సిరీస్‌లో అందరి దృష్టి అభిషేక్ శర్మపై నిలువనుంది.అఅతను ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.

ఇదే మంచి తరుణం..
మరోవైపు యువ ఆటగాళ్లకు ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు సంపాదించాలంటే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వీరిపై నెలకొంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు కొంతకాలంగా యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జింబాబ్వే సిరీస్‌లోనూ యువ ఆటగాళ్లకే ఛాన్స్ ఇచ్చారు. కుర్రాళ్లు కూడా ఈ ఛాన్స్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. గిల్, అభిషేక్, పరాగ్, రింకు, జురేల్, అవేశ్ ఖాన్, ఖలీల్, సాయి సుదర్శన్, బిష్ణోయ్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. తమ మార్క్ ఆటతో చెలరేగితే జింబాబ్వేను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు.

తక్కువ అంచనా వేయలేం..
ఇక ఆతిథ్య జింబాబ్వే జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆ జట్టు సమతూకంగా కనిపిస్తోంది. సికందర్ రజాపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. జొనాథన్ క్యాంప్‌బెల్, ఇన్నొసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, క్లైవ్ మదాండె, లుక్ జొంగ్వె, మసకద్జా తదితరులతో జట్టు బలంగా కనిపిస్తోంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

జట్ల వివరాలు:
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, రవి బిష్ణోయ్, సాయి సుదర్శన్, జితేష్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రాణా.

జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, మరుమాని, సికందర్ రజా (కెప్టెన్), జొనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మదాండె, ఇన్నొసెంట్ కైయా, వెస్లీ మధేవర్, లుక్ జొంగ్వే, వెల్లింగ్టన్ మసకద్జా, మజరబ్బాని, రిచ్ నగర్వా, టెండయ్, చతరా, బ్రాండన్ మవుతా, డియాన్ మేయర్స్, ఫరాజ్‌అక్రమ్, అంతుమ్ నఖ్వి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News