దంబుల్లా: శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా పది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్రమే చేసింది.
భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. రేణుకా సింగ్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచింది. ఆరంభంలోనే కీలకమైన మూడు వికెట్లను తీసి బంగ్లాదేశ్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఓపెనర్లు దిలారా అక్తర్ (6), ముర్షిదా ఖాతున్ (4)లు జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. వీరిద్దరిని రేణుకా వెనక్కి పంపింది. వన్‌డౌన్‌లో వచ్చిన ఇష్మా తంజీమ్ (8) కూడా నిరాశ పరిచింది. ఆమెను కూడా రేణుకా సింగ్ చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ మళ్లీ కోలుకోలేక పోయింది. కెప్టెన్ నిగర్ సుల్తానా ఒక్కటే ఒంటరి పోరాటం చేసింది.
భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న నిగర్ 51 బంతుల్లో రెండు ఫోర్లతో 32 పరుగులు సాధించింది. మిగతా వారిలో షోమ అక్తర్ 19 (నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరును అందుకుంది. ఇతర బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ మూడేసి వికెట్లను పడగొట్టారు. రేణుకా నాలుగు ఓవర్లలో పది పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తీసింది. రాధా 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లను పడగొట్టింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 11 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయం అందుకుంది.
ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు ఘన విజయం సాధించి పెట్టారు. సమన్వయంతో ఆడిన షెఫాలీ 2 ఫోర్లతో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మరోవైపు ధాటిగా బ్యాటింగ్ చేసిన మంధాన 39 బంతుల్లోనే 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 55 పరుగులు సాధించింది. ఈ జోడీని విడగొట్టేందుకు బంగ్లాదేశ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. షెఫాలీ, మంధాన అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. బంగ్లాపై పది వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసిన టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం ఫైనల్ సమరం జరుగనుంది.