Tuesday, September 17, 2024

చివరి టి20లో సౌతాఫ్రికాపై టీమిండియా గెలుపు

- Advertisement -
- Advertisement -

చెన్నై: సౌతాఫ్రికా మహిళలతో మంగళవారం జరిగిన మూడో, చివరి టి20లో భారత్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టి20లో సౌతాఫ్రికా విజయం సాధించగా, రెండో టి20 వర్షం వల్ల రద్దయ్యింది. ఇక మూడో టి20లో ఆతిథ్య భారత్ గెలవడంతో సిరీస్ సమంగా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 17.1 ఓవర్లలో కేవలం 84 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి టీమ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. సఫారీ టీమ్‌లో తంజీమ్ బ్రిట్స్ (20), మరిజానె కాప్ (10), అంకె బోస్చ్ (17) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు.

దీంతో జట్టు ఇన్నింగ్స్ 84 పరుగుల వద్దే ముగిసింది. భారత బౌలర్లలో పూజా వస్త్రకర్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచింది. 13 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టింది. రాధా యాదవ్ కూడా మెరుగైన బౌలింగ్‌తో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది. రాధా ఆరు పరుగులకు మూడు వికెట్లను తీసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 10.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు షెఫాలీ వర్మ 27 (నాటౌట్), స్మృతి మంధాన 54 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పూజా వస్త్రకర్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News