అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను నిందించాలని ప్రయత్నించిన ప్రతిసారీ పాకిస్తాన్‌కు భంగపాటు తప్పడం లేదు. తాజాగా పాకిస్తాన్‌పై భారత్ మరొకసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రాంతం ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, చట్టవిరుద్ధంగా పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ భూభాగాలనే ఖాళీ చేయవలసిందేనని భారత్ సుస్పష్టం చేసింది. శాంతి పరిరక్షణ సంస్కరణలపై ఐక్యరాజ్య సమితి (యుఎన్) భద్రతా మండలిలో చర్చ సందర్భంగా పాకిస్తాన్ ప్రతినిధి మాట్లాడుతూ, కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనితో ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, పాకిస్తాన్ అనవసర అంశాలను లేవనెత్తుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీర్‌పై మరొకసారి అనవసర వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల వారు చేసే చట్టవిరుద్ధ వాదనలు నిజమైపోవని హరీష్ అన్నారు.
ఇటువంటి ప్రయత్నాలతో సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరని ఆయన అన్నారు.‘తమ ప్రాంతీయవాద, విభజనవాద అజెండాపై ముందుకు సాగేందుకు ఈ వేదిక దృష్టిని మళ్లించే ప్రయత్నం చేయవద్దని పాకిస్తాన్‌కు సలహా ఇస్తాం’ అని హరీష్ చెప్పారు. మరింత విస్తృతంగా సమాధానం ఇచ్చే హక్కును వినియోగించుకోకుండా భారత్ సంయమనం పాటిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్‌లోని కొంత ప్రాంతం ఇప్పటికీ పాకిస్తాన్ ఆక్రమణలోనే ఉందని, దానిని పాకిస్తాన్ ఖాళీ చేయవలసిందేనని హరీష్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ కుతంత్రాలు మానుకుంటే మంచిదని హరీష్ హితవు పలికారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత్ 2019 ఆగస్టు 5న రాజ్యాంగం 370 అధికరణాన్ని రద్దు చేసిన తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఉగ్రవాద, సంఘర్షణ, దౌర్జన్యకాండ రహిత వాతావరణంలో పాకిస్తాన్‌తో సాధారణ సంబంధాలను తాము వాంఛిస్తున్నట్లు భారత్ పదే పదే తెలియజేసింది.