బెంగళూరు : చంద్రయాన్3 విజయంతో అంతరిక్ష సాంకేతికతలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని ఇస్రో మాజీ ఛైర్మన్ కె. కస్తూరిరంగన్ అన్నారు. ఇకపై అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన సాంకేతికత కోసం భారత్ ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు. గతంలో అనేక దేశాలు భారత్‌కు అణు, అంతరిక్ష రంగాల్లో సాంకేతికత అందించడానికి నిరాకరించాయని గుర్తు చేశారు. ఈ విజయంతో ఇకపై ఏ దేశమైనా భారత్‌కు అవసరమైన సాయం అందించేందుకు వెనుకాడదని చెప్పారు. ఓ జాతీయ ఆంగ్ల వార్తా పత్రికతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావడంతో అంతర్జాతీయంగా అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన నిర్ణయాత్మక ప్రక్రియలలో భారత్ కీలక పాత్ర పోషించనుంది.
చంద్రుడిని చేరుకోవడం ద్వారా ఈ రంగంలో భారత్ శక్తి సామర్ధాలను ప్రపంచానికి చాటి చెప్పాం. ఇది స్పేస్ టెక్నాలజీతో భారత్‌ను ముందంజలో ఉంచడమే కాకుండా , భవిష్యత్‌లో గ్రహాన్వేషన్, అక్కడి వనరుల వెలికితీతలో కీలక పాత్ర పోషించేందుకు సాయపడుతుంది. గతంలో భారత్‌కు తగిన వనరులు లేక అంతరిక్ష ,అణుశక్తి, విభాగాలతో పాటు ఇతర రంగాల్లో సాంకేతికత కోసం ఇతర దేశాలపై ఆధారపడ్డాం. పలు సందర్భాల్లో సాయం అందించేందుకు ఆ దేశాలు నిరాకరించాయి. చంద్రయాన్ 3 విజయం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది” అని కస్తూరి రంగన్ అభిప్రాయపడ్డారు. కస్తూరి రంగన్ 19901994 వరకు యూఆర్‌ఎసీ డైరెక్టర్‌గా పనిచేశారు.
అనంతరం ఆయన 9 ఏళ్ల పాటు (19942003) ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో ఇస్రో తొలి లూనార్ మిషన్‌కు అడుగులు పడ్డాయి. ప్రస్తుత చంద్రయాన్ 3 విజయం నేపథ్యంలో ఆయన ఆనాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.