వారణాసి : భారత్ వచ్చే ఐదు సంవత్సరాలలో అభివృద్ధికి నమూనాగా మారనున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వారణాసిలో ప్రకటించారు. అది ‘మోడీ గ్యారంటీ’ అని ఆయన చెప్పారు. కాశీని ఒక ఉదాహరణగా ప్రధాని మోడీ పేర్కొంటూ, సంస్కృతి, సంప్రదాయం ఆధారంగా ఆధునికతను ఏవిధంగా మెరుగుపరచవచ్చో ప్రపంచం చూస్తోందని చెప్పారు. మోడీ గురువారం రాత్రి వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం చేరుకున్నారు.
ఆయన బెనారస్ హిందు విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు)లో ‘సంసద్ సంస్కృత ప్రతియోగిత’ విజేతలతో ఇష్టాగోష్ఠి సాగించారు. ‘కాశీని ఇప్పుడు ప్రపంచం అంతటా అభివృద్ధికి, వారసత్వ సంపదకు నమూనాగా పరిగణిస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయం ప్రాతిపదికగా ఆధునికతను ఏవిధంగా మెరుగుపరచవచో ప్రపంచం చూస్తున్నది’ అని ప్రధాని విశ్వవిద్యాలయంలో ప్రసంగం సందర్భంగా చెప్పారు. ‘రానున్న ఐదు సంవత్సరాలలో దేశం అభివృద్ధికి ప్రతీకగా మారుతుంది. అది మోడీ గ్యారంటీ’ అని ఆయన చెప్పారు.
భారత సుసంపన్న వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని ఆయన తెలిపారు. అయోధ్యలో జనవరి 22న రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని మోడీ ప్రస్తావిస్తూ, ‘రామ్ లల్లా కొత్త విగ్రహం ప్రతిష్ఠాపన దరిమిలా అయోధ్య కాశీ వలే పరిఢవిల్లుతుండడాన్ని ప్రపంచం తిలకిస్తోంది’ అని చెప్పారు. అదే విధంగా బుద్ధునికి సంబంధించిన ప్రదేశాలను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు, కుషీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించినట్లు ప్రధాని మోడీ తెలియజేశారు.
కాశీ ‘వైభవాన్ని’ మోడీ అభివర్ణిస్తూ, ‘ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన, విభిన్న భాషలు, మాండలికాలు మాట్లాడుతున్న ప్రజలు కాశీలో స్థిరపడ్డారు. అటువంటి విభిన్నత్వం ఉన్న ప్రదేశంలో కొత్త భావనలు పుట్టుకువస్తున్నాయి’ అని ఆయన తెలిపారు. ‘అందుకే విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంలో అది భారత్ కొత్త పంథాను నిర్దేశిస్తుందని, భారత్‌ను మహోజ్వల భవిత దిశగా తీసుకువెళుతుందని చెప్పాను’ అని మోడీ తెలిపారు.
‘అమృత్ కాల్’ సమయంలో యువ తరం దేశాన్ని సమున్నత శిఖరాలకు తీసుకువెళుతుండడం గర్వ కారణం అని మోడీ పేర్కొ,న్నారు. ‘కాశీ కేవలం పుణ్య క్షేత్రం కాదు. అది భారత శాశ్వత విజ్ఞతకు చైతన్య కేంద్రం కూడా’ అని మోడీ అన్నారు. అంతకు ముందు ప్రధాని మోడీ కాశీ సంసద్ జ్ఞాన్ ప్రతియోగిత, కాశీ సంసద్ ఫోటోగ్రఫీ ప్రతియోగిత, కాశీ సంసద్ సంస్కృత ప్రతియోగిత విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు.