ఇక సాయం అందదన్న ప్రచారంపై భారత్ రాయబార కార్యాలయం స్పందన
న్యూఢిల్లీ : శ్రీలంకకు భారత్ నుంచి ఇక సాయం అందబోదన్న వార్తలపై శ్రీలంక లోని భారత్ కార్యాలయం దీటుగా స్పందించి సాధ్యమైనన్ని మార్గాల్లో సాయం అందుతుందని, ముఖ్యంగా సుదీర్ఘకాల పెట్టుబడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఇంతవరకు శ్రీలంకకు భారత్ నుంచి దాదాపు 4 బిలియన్ డాలర్ల వరకు సాయం అందినందున ఇక మరే సాయం అందబోదని వచ్చిన వార్తలపై శ్రీలంక లోని భారత్ హైకమిషన్ మంగళవారం ఒక ప్రకటనలో వివరించింది. ఈ ఏడాది ఇంతవరకు నాలుగు బిలియన్ డాలర్ల వరకు శ్రీలంకకు భారత్ ఆర్థిక సాయం అందించిందని, ఇతర ద్వైపాక్షిక, బహు పాక్షిక భాగస్వామ్య దేశాలను కూడా శ్రీలంకకు సాయం అందించాలని అభ్యర్థించినట్టు పేర్కొంది. శ్రీలంకలో ప్రస్తుతం దాదాపు 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో భారత్ అభివృధ్ధి ప్రాజెక్టులను నిర్మిస్తోందని, శ్రీలంక విద్యార్థులకు భారత్‌లో ఉన్నత విద్యకు సంబంధించి స్కాలర్‌షిప్‌లు అందుతున్నాయని వివరించింది. అలాగే భారత్ లోని ముఖ్యమైన సంస్థల్లో శ్రీలంక యువతకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇవ్వడమౌతోందని పేర్కొంది. శ్రీలంకతో సన్నిహిత, సుదీర్ఘ సంబంధాల సహకారంతో శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం కొనసాగుతోందని వెల్లడించింది.