Friday, December 20, 2024

ప్రపంచకప్ సెమీస్ బెర్తులు ఖరారు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. పాకిస్థాన్ టీమ్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. బాబర్ ఆజమ్ సేన లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. పాక్‌తో శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 337 పరుగుల భారీ స్కోరు సాధించడంతో పాక్‌కు సెమీస్ ఛాన్స్ లేకుండా పోయింది. ఇంగ్లండ్ ఉంచిన లక్ష్యాన్ని పాక్ 6.4 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంది. అయితే పాక్ ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలం కావడంతో టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ గెలిచినా ఎలాంటి ప్రయోజం ఉండదు. ఇంగ్లండ్ ఇంతకుముందే నాకౌట్ రేసుకు దూరమైన సంగతి తెలిసిందే.

15న తొలి సెమీ ఫైనల్
ముంబై వేదికగా నవంబర్ 15న తొలి సెమీ ఫైనల్ జరుగనుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా నాలుగో స్థానాన్ని దక్కించుకున్న న్యూజిలాండ్‌తో తొలి సెమీస్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టును నవంబర్ 19న జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. తుది సమరం అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది. లీగ్ దశలో భారత్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లోనూ విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్ అగ్రస్థానానికి ఢోకా ఉండదు. న్యూజిలాండ్ 9 మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో కివీస్‌కు సెమీస్ బెర్త్ ఖరారైంది. ఇక నవంబర్ 16న కోల్‌కతా వేదికగా జరిగే రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాఆస్ట్రేలియా తలపడుతాయి.

లీగ్ దశలో దక్షిణాఫ్రికా 9 మ్యాచుల్లో ఏడు విజయాలు సొంతం చేసుకుని రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియా కూడా ఏడింటిలో గెలిచినా రన్‌రేట్‌లో వెనుకబడడంతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికాఆస్ట్రేలియాల మధ్య రెండో కోల్‌కతాలో సెమీస్ పోరు జరుగనుంది. ఇదిలావుంటే ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లండ్, మాజీ విజేతలు పాకిస్థాన్, శ్రీలంకలతో పాటు నెదర్లాండ్స్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం పది జట్లు పోటీ పడ్డాయి. అక్టోబర్ 15న ప్రారంభమైన ఈ మెగా టోర్నీకి నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో తెరపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News