Tuesday, December 24, 2024

సభలు.. ప్రచారాలు, ఓటింగ్ కష్టమే

- Advertisement -
- Advertisement -

ఎన్నికలు పైగా వడదడల ఎండాకాలం
వెదర్ బులెటిన్‌లను బట్టే బ్యాలెట్ ప్రక్రియ
కేంద్రానికి వాతావరణ శాఖ కీలక సూచన

న్యూఢిల్లీ : ఎన్నికల ప్రక్రియ ఏ విధమైనదైనప్పటికీ దేశంలో వాతావరణం, ఎండా వానాల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని భారత వాతావరణ విభాగం (ఐఎండి) పేర్కొంది. లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల జమిలి ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఐఎండి అధినేత మృత్యుంజయ మెహాపాత్ర స్పందించారు. ఎన్నికలంటేనే విస్తృత ప్రక్రియ. జమిలి అనేక రాష్ట్రాలు ,యుటిలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించే మరింత కీలక ప్రక్రియ అవుతుంది. జమిలికి వెళ్లాలనుకునే ముందు అధికార యంత్రాంగం వాతావరణ పరిస్థితులు , ప్రభావాల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈసారి లోక్‌సభ ఎన్నికల దశ అంతా కూడా దేశంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అత్యధిక వేడిమి, వడగాడ్పుల వాతావరణ పరిస్థితి నడుమనే సాగనుంది. ఈ విషయాన్ని ఎన్నికల అధికార యంత్రాంగం కానీ , ప్రభుత్వ వర్గాలు కానీ ముందుగా గమనించాయా? గమనించి కూడా ముందుకు సాగాయా? అనేది నిర్థారణ కాలేదు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ అంతా ప్రకటితం అయి ఉంది. ఈ దశలో తాము చేసేది చేయాల్సింది ఒక్కటే అని, సకాలంలో ఎప్పటికప్పుడు వాతావరణ బులెటిన్లు వెలువరించడం, ఇందుకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు వారికి వీలు కల్పించడం తప్పితే తాము చేసేదేమీ లేదని ఐఎండి సారధి తెలిపారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఎన్నికల సభలు, ప్రచారాలు, రోడ్ షోలు అన్ని కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం, రాత్రి ఏడుగంటల వరకూ అధికారికంగా నిర్వహించేందకు వీలుంది.

అయితే మిట్టమధ్యాహ్నం ప్రచారం లేదా సభలు ఓటింగ్ ఉంటే , ఇదే సమయంలో తీవ్రస్థాయి వడగాడ్పులకు అవకాశం ఉన్నందున ఈసారి ఎన్నికల్లో ఇబ్బందికర పరిణామం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే ప్రచార సమయాన్ని మార్చుకోవాలని సూచించే ప్రతిపాదన తమవద్ద ఏదీ లేదని ఐఎండి అధికారి తెలిపారు.ఈ సారి ఏడు విడతల అత్యంత విస్తృత స్థాయి సార్వత్రిక ఎన్నికలలో దాదాపుగా వందకోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు. కాగా ఎప్రిల్ నుంచి జూన్ వరకూ సాగే ఈ భారీ ప్రక్రియ దశలోనే తీవ్రస్థాయిలో ఎండవేడిమి ఉంటుంది. ఈ విషయంపై ఐఎండి స్పందించింది. ప్రచారంలో సభలలో పాల్గొనేవారు, ఓటింగ్‌కు క్యూలలో నిలబడే వారికి అధికార యంత్రాంగం మరింతగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

వారికి తగు విధంగా తాగునీరు అందించాలి. వడదెబ్బలకు గురైన వారికి వెంటనే ప్రాధమిక చికత్స జరిపేందుకు అవసరం అయిన అత్యయిక సిబ్బంది ఉండాల్సిందే. ఆరోగ్యకార్యకర్తలను, ఇతరత్రా వాలంటీర్లను రంగంలోకి దింపాల్సిందే అని మెహాపాత్ర తెలిపారు. ఓటర్లతో పాటు ఎన్నికల విధి నిర్వహణ సిబ్బందికి కూడా పలు రకాలుగా ఎండవేడిమి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌లలో తీవ్రస్థాయి ఎక్కువరోజుల వడగాడ్పులు ఈ నెల నుంచి వచ్చే నెల చివరి వరకూ నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ సమయంలోనే పలు ప్రాంతాలలో ప్రచారాలు, సభలు, పోలింగ్ వంటివి జోరందుకోవల్సి ఉంటుంది. ఎన్నికలు ఎండాకాలపు తీవ్రతను సమన్వయం చేసుకోవడం క్లిష్టమైన విషయం కానుంది. పోల్ షెడ్యూల్ ప్రకటనకు ముందు ఎన్నికల సంఘం తమను కూడా సంప్రదించిందని దీనికి తాము సరైన విధంగా వాతావరణ అంచనాల విశ్లేషణను అందించామని, నిర్ణయం వారిది అని , వాతావరణం గురించి చెప్పడమే తమ బాధ్యత అని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News