హులున్‌బ్యూర్ (చైనా): ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చైనా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ హవా కొనసాగిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 51 గోల్స్ తేడాతో జపాన్‌ను చిత్తు చేసింది. ఆరంభ మ్యాచ్‌లో చైనాను ఓడించిన భారత్ ఈసారి కూడా జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. 2వ నిమిషంలో సుఖ్‌జీత్ సింగ్ జట్టుకు తొలి గోల్ సాధించి పెట్టాడు. తర్వాతి నిమిషంలోనే అభిషేక్ రెండో గోల్ నమోదు చేశాడు. తర్వాత కూడా భారత్ అటాకింగ్ గేమ్‌తో జపాన్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. భారత్ ధాటికి జపాన్ తట్టుకోలేక పోయింది.
17వ నిమిషంలో సంజయ్ భారత్‌కు మూడో గోల్ అందించాడు. పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి సంజయ్ భారత్ ఆధిక్యాన్ని 30కు పెంచాడు. ఇక 41వ నిమిషంలో జపాన్ ఆటగాడు కజుమాసా తొలి గోల్ సాధించాడు. ఇక ఆట ఆఖర్లో భారత్ మరో రెండు గోల్స్ నమోదు చేసింది. 54వ నిమిషంలో ఉత్తమ్ సింగ్ అద్భుత గోల్ నమోదు చేశాడు. ఇక 60వ నిమిషలో సుఖ్‌జీత్ తన రెండో గోల్‌ను సాధించాడు. దీంతో భారత్ 51 తేడాతో జపాన్‌ను చిత్తు చేసింది. తర్వాతి మ్యాచ్‌లో భారత్ మలేసియాతో తలపడుతుంది. బుధవారం ఈ పోరు జరుగనుంది. కాగా, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఇప్పటికే నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. కిందటి సీజన్‌లో కూడా భారత్ ట్రోఫీని గెలుచుకుంది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సత్తా చాటింది. కాగా, భారత్‌కు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ కూడా మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.