Sunday, December 22, 2024

రోహిత్ విధ్వంసం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ రోహిత్ (131) విధ్వంసక శతకంతో టీమిండియాకు ఘన విజయం సాధించి పెట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 35 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు శుభారంభం అందించారు. కెప్టెన్ రోహిత్ ఆరంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఇషాన్ ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేయగా రోహిత్ భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. రోహిత్‌ను కట్టడి చేయడంలో అఫ్గాన్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యాడు.

అసాధారణ షాట్లతో విరుచుకు పడిన భారత కెప్టెన్ పరుగుల వరద పారించాడు. అతని ధాటికి ప్రత్యర్థి బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించిన రోహిత్ 63 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు. ఇదే క్రమంలో వరల్డ్‌కప్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ 47 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్‌తో కలిసి 18.4 ఓవర్లలోనే 156 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌లో పాలుపంచుకున్నాడు. ఇక చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 84 బంతుల్లోనే 16 ఫోర్లు, మరో ఐదు సిక్సర్లతో 131 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక మిగిలిన లాంఛనాన్ని కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌లు పూర్తి చేశాడు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన విరాట్ కోహ్లి 56 బంతుల్లో ఆరు ఫోర్లతో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ 25 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు.

ఆదుకున్న హష్మతుల్లా
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్‌ను కెప్టెన్ హష్మతుల్లా షాహిది ఆదుకున్నాడు. ఒక దశలో అఫ్గాన్ 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. అయితే అజ్మతుల్లాతో కలిసి కెప్టెన్ హష్మతుల్లా ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హష్మతుల్లా 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 80 పరుగులు చేశాడు. మరోవైపు ధాటిగా ఆడిన అజ్మతుల్లా 4 సిక్సర్లు, రెండు బౌండరీలతో 62 పరుగులు సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News