ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు కుప్పకూలింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 46.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జట్టుకు శుభారంభం అందించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 36 బంతుల్లోనే 7 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి (22) పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. కానీ వికెట్ కీపర్ కెఎల్ రాహుల్‌తో కలిసి వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గిల్ 129 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాహుల్ 47 బంతుల్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో అజేయంగా 41 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు.
ఆరంభంలోనే..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. షమి ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ సౌమ్య సర్కార్ (0)ను ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్‌లో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటోను హర్షిత్ రాణా వెనక్కి పంపాడు. అతను ఖాతా కూడా తెరవలేదు. కొద్ది సేపటికే మెహదీ హసన్ మీరాజ్ (5) కూడా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే తంజిద్ హసన్ (25)కు వెనుదిరిగాడు. తర్వాతి బంతికే ముష్ఫికుర్ రహీం (0) కూడా ఔటయ్యాడు. అక్షర్ పటేల్ వరుస బంతుల్లో ఈ రెండు వికెట్లను పడగొట్టాడు.
ఆదుకున్న తౌహిద్, జాకేర్
దీంతో బంగ్లాదేశ్ 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈదశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను తౌహిద్ హృదయ్, జాకేర్ అలీ తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు టీమిండియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. తౌహిద్ దూకుడుగా బ్యాటింగ్ చేయగా జాకేర్ సమన్వయంతో ఆడాడు. జాకేర్ 114 బంతుల్లో 4 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 153 పరుగులు జోడించాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తౌహిద్ హృదయ్ 118 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. రిశాద్ హుస్సేన్ (18) తప్ప మిగతా వారు విఫలం కావడంతో బంగ్లా ఇన్నింగ్స్ 228 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో షమి ఐదు, హర్షిత్ రాణా మూడు, అక్షర్ రెండు వికెట్లు పడగొట్టారు.