Monday, November 25, 2024

కివీస్‌పై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

బ్లూమ్‌ఫౌంటైన్: అండర్19 ప్రపంచకప్‌లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్6 మ్యాచ్‌లో టీమిండియా 214 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన న్యూజిలాండ్ 28.1 ఓవర్లలో కేవలం 81 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు ఆరంభం నుంచే చెలరేగారు. ఓపెనర్ టామ్ జోన్స్ (0), వన్‌డౌన్‌లో వచ్చిన స్నేహిత్ రెడ్డి (0)లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు.

ఈ రెండు వికెట్లు కూడా రాజ్ లంబానికి దక్కాయి. దీంతో కివీస్ సున్నాకే రెండు వికెట్లను చేజార్చుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ మళ్లీ కోలుకోలేక పోయింది. జట్టులో జేమ్స్ నెల్సన్ (10), కెప్టెన్ జాక్సన్ (19), జాక్ కమింగ్ (16), వికెట్ కీపర్ థాంప్సన్ (12) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో సౌమీ పాండే నాలుగు, రాజ్ లంబాని, ముషీర్ ఖాన్ రెండేసి వికెట్లను పడగొట్టారు. కాగా, ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం.

ముషీర్ ఖాన్ శతకం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అర్షిన్ కుల్‌కర్ణి (9) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన యువ సంచలనం ముషీర్ ఖాన్ మరోసారి చెలరేగి పోయాడు. కివీస్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. అతనికి మరో ఓపెనర్ ఆదర్ష్ సింగ్ అండగా నిలిచాడు. ఇద్దరు కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆదర్ష్ సింగ్ 6 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. మరోవైపు చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరిచిన ముషీర్ ఖాన్ 126 బంతుల్లోనే 13 ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. ముషీర్‌కు ఇది ఈ టోర్నీలో రెండో శతకం కావడం విశేషం. కాగా, కెప్టెన్ ఉదయ్ శరణ్ (34), వికెట్ కీపర్ అవనీష్ (17) తదితరులు ముషీర్‌కు అండగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News