Monday, January 20, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్

- Advertisement -
- Advertisement -

ప్రతిష్ఠాత్మకమైన ఆసియా మహిళల ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచింది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఆతిథ్య భారత జట్టు 1-0 గోల్ తేడాతో చైనాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. భారత్ ఈ ట్రోఫీని గెలుచు కోవడం వరుసగా రెండోసారి కావడం విశేషం. కిందటిసారి కూడా భారత్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. ఈ ఏడాది కూడా టైటిల్ సాధించింది. చైనాతో తుది పోరు ఆసక్తికరంగా సాగింది. భారత్ మెరుగైన ఆటను కనబరిచినా గోల్స్ సాధించడంలో విఫలమైంది. భారత్ వరుస దాడులతో చైనాను ఉక్కిరిబిక్కిరి చేసింది. కానీ పటిష్టమైన డిఫెన్స్‌తో చైనా ఆతిథ్య జట్టు దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. కాగా, మొదటి అర్ధ భాగంలో భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. అయినా ఒక్కదాన్ని కూడా భారత్ గోల్‌గా మలచలేక పోయింది. ఇదిలావుంటే 31వ నిమిషంలో భారత్ శ్రమ ఫలించింది. స్టార్ క్రీడాకారిణి దీపిక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో సఫలమైంది. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.తర్వాత కూడా భారత్‌కు గోల్స్ చేసే పలు అవకాశాలు లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది. చైనా గోల్ కీపర్ అసాధారణ ప్రతిభతో భారత్ ప్రయత్నాలు సమర్థంగా తిప్పికొట్టింది.

మరోవైపు చైనా కూడా స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా శ్రమించింది. కానీ పటిష్టమైన భారత రక్షణశ్రేణిని ఛేదించి గోల్ సాధించలేక పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన భారత్ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. చైనా చివరి వరకు గట్టిగా పోరాడినా రన్నరప్‌తో సరిపెట్టుకోక తప్పలేదు. ఈ టోర్నమెంట్‌లో భారత్ అజేయంగా నిలిచి ట్రోఫీని సాధించడం విశేషం. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. అంతేగాక లీగ్ సమరంలో చైనాను మట్టికరిపించింది. తాజాగా ఫైనల్లోనూ మరోసారి చైనాను ఓడించి మూడోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. ఇదే క్రమంలో దక్షిణ కొరియా పేరిట ఉన్న మూడో ట్రోఫీల రికార్డును సమం చేసింది. బిహార్‌లో రాజ్‌గిర్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో పాటు మలేసియా, చైనా, దక్షిణ కొరియా, జపాన్, థాయిలాండ్ జట్లు పాల్గొన్నాయి. భారత్ లీగ్ దశలో ఐదు మ్యాచుల్లో విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News