సింగపూర్: భారత తలసరి ఆదాయం 2000 డాలర్లకన్నా తక్కువైనప్పటికీ డిజిటల్ టూల్స్,గొప్ప ఉత్పత్తి సామర్థ్యం కారణంగా వేలాది కోవిడ్-19 చికిత్సా కేంద్రాలను తెరచి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచామని విదేశీవ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఆయన సింగపూర్‌లో ‘గ్రేటర్ పవర్ కాంపిటీషన్: ద ఎమర్జింగ్ వరల్డ్ ఆర్డర్’ అనే అంశంపై బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకనామీ ఫోరమ్‌లో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి భారత్‌కు వ్యాపించినప్పుడు వెంటిలేటర్లు అసెంబుల్ చేసే కంపెనీలు రెండే ఉండేవని, ఎన్95 మాస్కులను తయారుచేసే కంపెనే లేదని, అతి తక్కువ వైద్య పరికరాలుండేవని అన్నారు. కోవిడ్-19 తర్వాత ఆరోగ్య మౌలికవసతులు భారీగా పెరిగాయన్నారు. ‘‘వ్యాక్సిన్ పరంగాకాక మొత్తం ఫార్మా రంగంను దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు నాడు భారత్ హైడ్రోక్లోరిక్విన్‌కు, పారాసిటిమాల్‌కు చాలా డిమాండ్ ఏర్పడింది. దాంతో మేము వివిధ ఔషధాలను పది రెట్లు, ఇరవై రెట్ల వరకు ఉత్పత్తి పెంచాము” అన్నారు.