వెస్టిండీస్‌పై భారత మహిళల ఘన విజయం
హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 155 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో విజయం కాగా విండీస్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన విండీస్ 40.3 ఓవర్లలో కేవలం 162 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్‌కు ఓపెనర్లు డియాండ్రా డాటిన్, హేలీ మాథ్యూస్ మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు.
దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచిన డాటిన్ 46 బంతుల్లోనే పది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 62 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 12.2 ఓవర్లలోనే 100 పరుగులు జోడీంచింది. అయితే ఆ తర్వాత విండీస్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లు సమష్టిగా రాణిస్తూ విండీస్ ఇన్నింగ్స్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేశారు. వన్‌డౌన్‌లో వచ్చిన కిసియా నైట్ (1), కెప్టెన్ స్టెఫాని టెలర్ (1), వికెట్ కీపర్ షెమైన్ క్యాంప్‌బెల్ (11), చేడిన్ నేషన్ (19)లు పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచారు. ఇక జట్టును ఆదుకుంటారని భావించిన హెన్రీ (7), అలియా అలెన్ (4), అనిసా మహ్మద్ (2) కూడా విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా మూడు, మేఘన సింగ్ రెండు వికెట్లు పడగొట్టారు.
స్మృతి, కౌర్ శతకాలు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, యాస్తిక భాటియా శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన భాటియా ఆరు ఫోర్లతో 31 పరుగులు చేసి ఔటైంది. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ (5), దీప్తి శర్మ (15) ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. దీంతో భారత్ 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ తమపై వేసుకున్నారు. మంధాన తన మార్క్ షాట్లతో అలరించింది. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మంధాన 119 బంతుల్లోనే 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో 123 పరుగులు చేసింది. ఇక వైస్ కెప్టెన్ కౌర్ 107 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 109 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా 317 పరుగుల భారీ స్కోరును సాధించింది.