Wednesday, January 22, 2025

ఆస్ట్రేలియా మహిళల విజయం

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత్‌తో గురువారం జరిగిన మహిళల తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా మహిళా టీమ్ 46.3 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ అలీసా హీలీ ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిసె పేరితో కలిసి మరో ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచింది. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును లక్షం దిశగా నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆతిథ్య జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించేదు. ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. చెలరేగి ఆడిన పేరి 72 బంతుల్లోనే 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 75 పరుగులు చేసి వెనుదిరిగింది.

ఈ క్రమంలో రెండో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకుంది. ఆ వెంటనే లిచ్‌ఫీల్డ్ కూడా పెవిలియన్ చేరింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన లిచ్‌ఫీల్డ్ 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 78 పరుగులు చేసింది. ఆ తర్వాత జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యతను బేథ్ మూనీ, తహిలా మెక్‌గ్రాత్ తమపై వేసుకున్నారు. మూనీ 4 ఫోర్లతో 42 పరుగులు చేసింది. ఇక ధాటిగా ఆడిన మెక్‌గ్రాత్ 55 బంతుల్లోనే 11 ఫోర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను జెమీమా రోడ్రిగ్స్, పూజా వస్త్రాకర్ ఆదుకున్నారు. ధాటిగా ఆడిన రోడ్రిగ్స్ 7 ఫోర్లతో 52 పరుగులు చేసింది. మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన పూజా వస్త్రాకర్ 46 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఓపెనర్ యస్తిక భాటియా (49) కూడా తనవంతు పాత్ర పోషించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News