నేడు ఆస్ట్రేలియాతో కీలక పోరు
ఆక్లాండ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మిథాలీరాజ్ సేన శనివారం ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్ ఆడనుంది. మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లోనూ గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఓడిన భారత్ సెమీస్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించాలంటే మిథాలీ సేన అసాధారణ ఆటను కనబరచక తప్పదు. మరోవైపు ఆస్ట్రేలియా ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఈసారి కూడా గెలిచి సెమీస్‌కు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి బలమైన జట్లను ఆస్ట్రేలియా ఓడించింది. దీంతో భారత్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు ఆస్ట్రేలియా జట్టులో కొదవలేదు. ఓపెనర్లు అలీసా హీలీ, రాఛెల్ హేన్స్, కెప్టెన్ మెగ్ లానింగ్, ఎలిసె పెరీ, బెథ్ మూనీ వంటి మ్యాచ్ విన్నర్లు ఆస్ట్రేలియాలో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు రాణించినా ఆసీస్‌కు విజయం నల్లేరుపై నడకే. ఇక మెగాన్ షేట్, జెస్ జొనాసెన్, గార్డ్‌నర్, మెక్‌గ్రాత్ వంటి అగ్రశ్రేణి బౌలర్లు కూడా ఉండనే ఉన్నారు. దీంతో ఆస్ట్రేలియా మరో విజయంపై కన్నేసింది.
సవాల్ వంటిదే..
మరోవైపు భారత్‌కు ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి. భారత్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు మ్యాచుల్లోనే గెలిచింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి పాలైంది. ఇక బలమైన ఆస్ట్రేలియాపై ఎలా ఆడుతుందో చెప్పలేం. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, వెస్టిండీస్‌లను ఓడించిన భారత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ఆస్ట్రేలియాపై గెలిస్తే భారత్ సెమీస్ అవకాశాలు చాలా వరకు మెరుగుపడుతాయి. భారత్ రానున్న మ్యాచుల్లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే మిథాలీ సేనకు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలు కావడంతో భారత్‌కు ప్రతికూలంగా మారింది. ఈ పరాజయం జట్టు సెమీస్ అవకాశాలను క్లిష్టంగా మార్చింది. అయితే మంధాన, హర్మన్‌ప్రీత్, మిథాలీ, దీప్తి, పూజా వస్త్రాకర్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో భారత్ గెలుపు అవకాశాలను కూడా కొట్టి పారేయలేం. అయితే అసాధారణ ఆటను కనబరిస్తే తప్పా ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం టీమిండియాకు చాలా కష్టమని చెప్పక తప్పదు.
వెస్టిండీస్ ఉత్కంఠ విజయం
మౌంట్ మాంగనూయి: ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్ మహిళా టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి విండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఒంటరి పోరాటం చేసి వికెట్ కీపర్ క్యాంప్‌బెల్ అర్ధ సెంచరీ సాధించింది. ప్రత్యర్థి బౌలర్లను సమన్వయంతో ఎదుర్కొన్న క్యాంప్‌బెల్ 107 బంతుల్లో ఐదు బౌండరీలతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
మిగతా వారిలో ఫ్లెచర్ (17), ఓపెనర్లు డాటిన్ (17), మాథ్యూస్ (18) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 136 పరుగులకే ఆలౌటైంది. విండీస్ బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. హేలీ మాథ్యూస్ అద్బుత బౌలింగ్‌ను కనబరిచింది. 10 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఇక ఫ్లెచర్; కెప్టెన్ స్టెఫాని కూడా తమవంతు పాత్ర పోషించారు. ఇద్దరు చెరో మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. ఇక బంగ్లా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. సమష్టి వైఫల్యంతో స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పోయారు. ఈ వరల్డ్‌కప్‌లో విండీస్‌కు ఇది మూడో విజయం కావడం విశేషం.