సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్
మళ్లీ చిత్తయిన ఇంగ్లండ్.. రెండో వన్డేలోనూ భారత్ విజయం
కటక్: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. వరుస మ్యాచ్‌లలో విఫలమవుతూ వస్తున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. 90 బంతుల్లో 12 పోర్లు, 7 సిక్సర్లతో చెలరేగిన హిట్‌మ్యాన్ 119 పరుగులు చేసి భారత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రోహిత్ తోడు మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(60) సైతం అర్ధ శతకంతో చెలరేగి భారత్‌కు శుభారంభం ఇచ్చారు. మూడ వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
రాణించిన రూట్, డక్కెట్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకే ఆలౌటైంది. బెన్ డక్కెట్(65), జోరూట్(69) హాఫ్ సెంచరీలతో రాణించగా.. లియామ్ లివింగ్ స్టోన్(41), జోస్ బట్లర్(34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/35)రాణించగా.. మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష ఛేదనకు దిగిన భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లకు 308 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ శతక్కొట్టగా.. శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్(44), అక్షర్ పటేల్(41 నాటౌట్) బ్యాట్ ఝులిపించారు. ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ(5) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్(2/27) రెండు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు.
హిట్ మ్యాన్ శతకం..
భారీ లక్ష్యచేధనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భారీ సిక్సర్లతో విధ్వంసం చేశాడు. పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. పవర్ ప్లేలోనే రోహిత్ శర్మ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. తర్వాత శుభ్‌మన్ గిల్ 45 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. 136 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని జేమీ ఓవర్టన్ విడదీసాడు. శుభ్‌మన్ గిల్‌ను క్లీన్ బౌల్ చేశాడు. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తనదైన కవర్ డ్రైవ్‌తో బౌండరీ కొట్టాడు. కానీ అతన్ని ఆదిల్ రషీద్ పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ శర్మ చెలరేగాడు. ఆదిల్ రషీద్ వేసిన 26వ ఓవర్‌లో రెండో బంతిని సిక్సర్ తరలించి 76 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
రోహిత్‌కు ఇది 32వ శతకం. సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడిన రోహిత్ వేగంగా పరుగులు చేశాడు. లివింగ్ స్టోన్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 70 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అక్షర్ పటేల్‌తో కలిసి శ్రేయస్ అయ్య ర్(44) జట్టును విజయం దిశగా నడిపించాడు. హాఫ్ సెంచరీ ముంగిట అతను రనౌటయ్యాడు. క్రీ జులోకి వచ్చిన కేఎల్ రాహుల్(10), హార్దిక్ పాండ్యా(10) నిరాశపర్చగా.. రవీంద్ర జడేజా సాయం తో అక్షర్ పటేల్ విజయలాంఛనాన్ని ముగించాడు.