బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. భారీ లక్షంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మిఛెల్ మార్ష్, అరోన్ ఫించ్ శుభారంభం అందించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ 18 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన ఫించ్ 54 బంతుల్లోనే 76 పరుగులు చేసి ఔటయ్యాడు. మాక్స్‌వెల్ 23 పరుగులు చేశాడు. అయితే మిగతావారు విఫలం కావడంతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన షమి 4 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. వికెట్ కీపర్ ఇంగ్లిస్, కమిన్స్, రిచర్డ్‌సన్‌లను షమి ఔట్ చేశాడు. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన షమి ఆడిన తొలి మ్యాచ్‌లోనే కళ్లు చెదిరే ప్రదర్శన చేయడం టీమిండియాకు ఊరటనిచ్చే అంశమే. ఇక అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను ఓపెనర్ కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లు ఆదుకున్నారు. ధాటిగా ఆడిన రాహుల్ 3 సిక్సర్లు, ఆరు ఫోర్లతో 57 పరుగులు చేశాడు. సూర్యకుమార్ 6 బౌండరీలు, ఒక సిక్స్‌తో 50 పరుగులు సాధించాడు. దీంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసింది.
India won by 6 runs against AUS in Warm Up Match