ట్రినిడాడ్: వెస్టిండీస్‌తో జరిగిన మూడో, చివరి వన్డేలో భారత్ 200 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 21తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (77), శుభ్‌మన్ గిల్ (85) మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. సంజూ శాంసన్ (51), కెప్టెన్ హార్దిక్ పాండ్య 70 (నాటౌట్)లు కూడా మెరుపులు మెరిపించారు. దీంతో టీమిండియా ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య వెస్టిండీస్ 35.3 ఓవర్లలో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ కేల్ మేయర్స్ (4) కూడా విఫమలయ్యాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ షై హోప్ (5) కూడా నిరాశ పరిచాడు. ఈ మూడు వికెట్లు కూడా ముకేశ్ కుమార్‌కే దక్కడం విశేషం.
ముకేశ్ ఆరంభంలోనే కీలకమైన వికెట్లు పడగొట్టడంతో విండీస్ మళ్లీ కోలుకోలేక పోయింది. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లు కూడా మెరుగైన బౌలింగ్‌ను కనబరిచారు. విండీస్ టీమ్‌లో అలిక్ అతనాజే (32), యన్నిక్ కరియా (19), అల్జారి జోసెఫ్ (26), గుడాకేశ్ మోతి 39 (నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. కార్టీ (6), హెట్‌మెయిర్ (4), రొమానో షెఫర్డ్ (8) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు, ముకేశ్ కుమార్ మూడు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఉనద్కట్‌కు ఒక వికెట్ దక్కింది. శుభ్‌మన్ గిల్‌కు మ్యాచ్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. నిలకడైన ఆటతో అలరించిన ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. కాగా, సిరీస్‌లో తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో విండీస్ విజయం సాధించింది. కాగా, భారత్ ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో సిరీస్‌లో పలు ప్రయోగాలు చేసింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు చివరి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు. తొలి వన్డేలో రోహిత్ చివర్లో బ్యాటింగ్‌కు దిగగా, కోహ్లి అసలు క్రీజులోకే రాలేదు.