చెన్నై : స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. ఆదివారం ముగిసిన తొలి టెస్ట్‌లో భారత్ 280 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రవిచంద్రన్ అశ్విన్(6/88) ధాటికి 234 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(82) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.
టీమిండియా బౌలర్లలో అశ్విన్, జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా బుమ్రాకు ఓ వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు 158/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ 62.1 ఓవర్లలోనే కుప్పకూలింది. ఓవైపు అశ్విన్.. మరోవైపు జడేజా స్పిన్‌తో బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. స్పిన్ ద్వయం ధాటికి 24 ఓవర్లలోనే బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయింది. పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న బంగ్లాదేశ్ ఓవర్‌నైట్ బ్యాటర్లు షకీబ్ అల్ హసన్, నజ్ముల్ షాంటోలు క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.
అశ్విన్ వేసిన తన తొలి ఓవర్‌లోనే షకీబ్ అల్ హసన్ క్రీజు వదిలాడు. అనంతరం లిట్టన్ దాస్‌ను జడేజా ఔట్ చేయగా.. మెహ్‌దీ హసన్ మీరాజ్‌ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు నిలకడగా ఆడుతూ సెంచరీ దిశగా సాగుతున్న బంగ్లా కెప్టెన్ షాంటోకు రోహిత్ తన మార్క్ కెప్టెన్సీతో చెక్ పెట్టాడు. జడేజా సాయంతో ఊరించే బంతి వేయించి వికెట్ల ముందు దొరకబట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన టస్కిన్‌ను అశ్విన్ ఔట్ చేయగా.. హసన్ మహముద్‌ను క్లీన్ బౌల్ చేసి భారత విజయాన్ని జడేజా లాంఛనం చేశాడు.
భారీ టార్గెట్..
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో టీమిండియాకు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. బ్యాటింగ్‌లో అశ్విన్(113), రవీంద్ర జడేజా(86) సత్తా చాటితే.. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా(4/50) నిప్పులు చెరిగాడు. రెండో ఇన్నింగ్స్‌ను టీమిండియా 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (119 నాటౌట్), రిషభ్ పంత్ (109) శతకాలతో చెలరేగాడు.