Wednesday, January 22, 2025

బౌలర్ల మ్యాజిక్…. కాన్పూర్‌లో భారత్ సంచలన విజయం

- Advertisement -
- Advertisement -

బంగ్లాతో సిరీస్ క్లీన్‌స్వీప్
కాన్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో, చివరి టెస్టులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 98 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (8) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఈ గెలుపుతో భారత్ సిరీస్‌ను 20తో క్లీన్‌స్వీప్ చేసింది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా కాన్పూర్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. తొలి మూడు రోజుల ఆట వర్షం బారిన పడినా భారత్ దూకుడైన ఆటతో ఈ మ్యాచ్‌లో సంచలన విజయాన్ని అందుకుంది. తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రెండో, మూడో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది.

ఇలాంటి స్థితిలో మ్యాచ్ డ్రా కావడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఆతిథ్య భారత జట్టు మాత్రం అసాధారణ ఆటతో మ్యాచ్‌ను దక్కించుకుని సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. టీమిండియా గెలుపు టెస్టు క్రికెట్‌లో కొత్త జోష్ నింపిందనే చెప్పాలి. గెలుపు ఏ మాత్రం అవకాశం లేని మ్యాచ్‌లో భారత్ చారిత్రక విజయంతో ఇతర జట్లకు స్ఫూర్తిగా నిలిచింది. భారత్ సాధించిన ఈ గెలుపు ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో చిరకాలం తీపి జ్ఞాపకంగా నిలిచి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవర్‌నైట్ స్కోరు 26/2తో మంగళవారం చివరి రోజు బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ మోమినుల్ హక్ (2)ను రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో బంగ్లాదేశ్ 36 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది.

షద్మాన్ పోరాటం..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఓపెనర్ షద్మాన్ ఇస్లామ్ తనపై వేసుకున్నాడు. అతనికి కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో అండగా నిలిచాడు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ జంటను విడగొట్టేందుకు భారత బౌలర్లు చాలా సేపటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. అయితే 37 బంతుల్లో రెండు ఫోర్లతో 19 పరుగులు చేసిన శాంటోను జడేజా వెనక్కి పంపాడు. దీంతో 55 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే షద్మాన్ కూడా ఔటయ్యాడు. 101 బంతుల్లో 50 పరుగులు చేసిన షద్మాన్‌ను ఆకాశ్ దీప్ ఔట్ చేశాడు.

వరుస క్రమంలో
ఆ తర్వాత బంగ్లాదేశ్ మళ్లీ కోలుకోలేక పోయింది. వికెట్ కీపర్ లిటన్ దాస్ (1), షకిబ్ అల్ హసన్ (0)లను కూడా పెవిలియన్ బాట పట్టించాడు. జట్టును ఆదుకుంటారని భావించిన మెహది హసన్ మిరాజ్ (9), తైజుల్ ఇస్లామ్ (0) కూడా విఫలమయ్యారు. వీరిద్దరిని జస్‌ప్రిత్ బుమ్రా వెనక్కి పంపాడు. మరోవైపు ముష్ఫికుర్ రహీం ఒక్కడే భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రహీం 63 బంతుల్లో ఏడు ఫోర్లతో 37 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 47 ఓవర్లలో 146 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజా మూడేసి వికెట్లను పడగొట్టారు.

యశస్వి జోరు..
తర్వాత 95 పరుగుల స్వల్ప లక్షంతో దిగిన భారత్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ రోహిత్ శర్మను మెహది హసన్ మిరాజ్ ఆరంభంలోనే పెవిలియన్ బాట పట్టించాడు. రోహిత్ ఒక ఫోర్‌తో 8 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన జోరును కొనసాగించాడు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ ఒక ఫోర్‌తో ఆరు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ వికెట్ కూడా మిరాజ్‌కే దక్కింది. అయితే సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి యశస్వి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన యశస్వి 45 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేసి తైజుల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 37 బంతుల్లో 4 ఫోర్లతో అజేయంగా 29 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. యశస్వికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

India won on Bangladesh

 

ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా అశ్విన్

బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రతిష్ఠాత్మకమైన ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో అశ్విన్ ఇటు బంతితో అటు బ్యాట్‌తో అలరించాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో చిరస్మరణీయ శతకాన్ని సాధించాడు. బంతితోనూ సత్తా చాటాడు. రెండో టెస్టులో కూడా అశ్విన్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఐదు వికెట్లను పడగొట్టాడు. తొలి టెస్టులో సెంచరీతో పాటు ఆరు వికెట్లను పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అశ్విన్‌ను ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా ఎంపిక చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News