ఓవల్: మహిళల వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా నిర్వహిస్తున్న వార్మప్ మ్యాచుల్లో టీమిండియా అదరగొడుతోంది. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన సాధన మ్యాచ్‌లో మిథాలీ సేన 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంతకుముందు తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను భారత్ ఓడించింది. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 258 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 177 పరుగులకే కుప్పకూలింది. లక్షఛేదనకు దిగిన విండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు.
ఆరంభం నుంచే భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు పడగొట్టారు. దీంతో విండీస్ ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. ఒక దశలో 53 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను వికెట్ కీపర్ క్యాంప్‌బెల్ ఆదుకుంది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న క్యాంప్‌బెల్ 63 పరుగులు చేసింది. మిగతావారు విఫలం కావడంతో విండీస్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ మూడు వికెట్లు పడగొట్టింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను ఓపెనర్ స్మృతి మంధాన ఆదుకుంది. ధాటిగా ఆడిన మంధాన 66 పరుగులు చేసింది. దీప్తి శర్మ (51), కెప్టెన్ మిథాలీ రాజ్ (30) తమవంతు పాత్ర పోషించారు.