Monday, December 23, 2024

కుర్రాళ్లకు సిరీస్

- Advertisement -
- Advertisement -

కదంతొక్కిన యశస్వి, గిల్
నాలుగో టి20లో భారత్ ఘన విజయం

హరారే: జింబాబ్వేతో శనివారం జరిగిన నాలుగో టి20లో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 31 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా తర్వాత ఆడిన మూడు టి20ల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 15.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే జయకేతనం ఎగుర వేసింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లు శుభారంభం అందించారు.

ఇద్దరు ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించారు. గిల్ కాస్త సమన్వయంతో బ్యాటింగ్ చేయగా యశస్వి తన మార్క్ షాట్లతో అలరించాడు. ఈ జోడీని కట్టడి చేసేందుకు జింబాబ్వే బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును లక్షం వైపు నడిపించారు. ఒకవైపు వికెట్లను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. యశస్వి వరుస ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు.

అతన్ని అడ్డుకోవడం జింబాబ్వే బౌలర్ల తరం కాలేదు. చూడచక్కని షాట్లతో అలరించిన యశస్వి, జైస్వాల్ భారత్‌ను గెలుపు బాటలో నడిపించారు. ధాటిగా ఆడిన యశసవి 53 బంతుల్లోనే 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 58 పరుగులు సాధించాడు. దీంతో భారత్ మరో 4.4 ఓవర్లు మిగిలివుండగానే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకుంది. యశస్వికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

శుభారంభం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేకు ఓపెనర్లు వెస్లీ మధెవర్, మరుమాని శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో ఆడారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. మరుమాని 3 ఫోర్లతో 32 పరుగులు చేశాడు. మధెవర్ 4 ఫోర్లతో 25 పరుగులు సాధించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన సికందర్ రజా 28 బంతుల్లో 3 సిక్సర్లు, రెండు బౌండరీలతో 46 పరుగులు చేశాడు. మిగతావారు విఫలం కావడంతో జింబాబ్వే స్కోరు 152 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో జింబాబ్వే ఆశించిన స్కోరు సాధించలేక పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News