Monday, December 23, 2024

తడబడినా విజయం మనదే

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 39.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు.

ఆరంభంలోనే..

సునాయాస లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 3 పరుగులు మాత్రమే చేసి స్టోయినిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లి కూడా నిరాశ పరిచాడు. 4 పరుగులు చేసిన కోహ్లిని స్టార్క్ వెనక్కి పంపాడు. తర్వాతి బంతికే సూర్యకుమార్ యాదవ్ కూడా ఔటయ్యాడు. అతను ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ కూడా స్టార్క్‌కే దక్కింది. కొద్ది సేపటికే శుభ్‌మన్ గిల్ కూడా వెనుదిరిగాడు. 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన గిల్‌ను కూడా స్టార్క్ ఔట్ చేశాడు. దీంతో భారత్ 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.

రాహుల్ పోరాటం..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను సీనియర్ ఆటగాడు కెఎల్ రాహుల్ తనపై వేసుకున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ఇటు రాహుల్, అటు హార్దిక్ కుదురుకోవడంతో భారత్ కోలుకున్నట్టే కనిపించింది. కానీ 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 25 పరుగులు చేసిన హార్దిక్‌ను స్టోయినిస్ ఔట్ చేశాడు. దీంతో 83 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్‌ను కోల్పోయింది.

జడేజా అండతో..

హార్దిక్ ఔటైనా రాహుల్ తన పోరాటాన్ని కొనసాగించాడు. తర్వాత వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రాహుల్ ధాటిగా ఆడగా, జడేజా సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. ఈ జోడీని విడగొట్టాలని ఆస్ట్రేలియా బౌలర్లు తీవ్రంగా ఫలించినా ఫలితం లేకుండా పోయింది. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన రాహుల్ 91 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా 5 ఫోర్లతో 45 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీతో భారత్ మరో 10.1 ఓవర్లు మిగిలివుండగానే విజయం అందుకుంది. ప్రత్యర్థి జట్టులో స్టార్క్ మూడు, స్టోయినిస్ రెండు వికెట్లు పడగొట్టారు.

మార్ష్ మెరుపులు

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా శుభారంభం లభించలేదు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (5)ను సిరాజ్ అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. కానీ వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి మరో ఓపెనర్ మిఛెల్ మార్ష్ స్కోరును పరిగెత్తించాడు. ఇటు మార్ష్ అటు స్మిత్‌లు ధాటిగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. స్మిత్ 4 ఫోర్లతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో మార్ష్‌తో కలిసి రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన మిఛెల్ మార్ష్ 65 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, పది ఫోర్లతో 81 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత భారత బౌలర్లు చెలరేగి పోయారు. షమి, సిరాజ్ మూడేసి వికెట్లతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. జడేజా రెండు వికెట్లతో తనవంతు పాత్ర పోషించాడు. కాగా, ఆస్ట్రేలియా చివరి ఏడు వికెట్లను 59 పరుగుల తేడాతో కోల్పోవడం గమనార్హం. ఇక ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News