Friday, December 20, 2024

ప్రపంచకప్‌కు జట్టు సిద్ధం..

- Advertisement -
- Advertisement -

పల్లెకెలె: సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియాను మంగళవారం ఎంపిక చేశారు. జట్టు వివరాలను ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. వరల్డ్‌కప్ కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. స్వదేశంలో జరిగే వరల్డ్‌కప్‌లో పాల్గొనే టీమిండియాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇక జట్టు ఎంపికలో ఈసారి అనుభవానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సీనియర్లు కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు లభించింది. అంతేగాక సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక రోహిత్ శర్మ ఈ మెగా టోర్నీలో జట్టుకు సారథ్యం వహిస్తాడు. హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ తదితరులకు విశ్వకప్ టీమ్‌లో చోటు దక్కలేదు.

దీంతో పాటు సీనియర్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్‌లకు కూడా నిరాశే మిగిలింది. వీరిని ప్రపంచకప్ జట్టులో స్థానం కల్పించలేదు. అశ్విన్ స్థానంలో అక్షర్ పటేల్‌ను, చాహల్‌కు బదులు కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్‌లకు స్థానం దక్కింది. ప్రసిద్ధ్ కృష్ణ, వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు కూడా జట్టులో స్థానం లభించలేదు. వికెట్ కీపర్లుగా కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేశారు. సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, మహ్మద్ షమీలు కూడా వరల్డ్‌ప్ జట్టులో స్థానం నిలబెట్టుకున్నారు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ దళానికి సారథ్యం వహించనున్నాడు. బుమ్రాతో పాటు షమీ, సిరాజ్, హార్దిక్, శార్దూల్ ఫాస్ట్ బౌలింగ్ భారాన్ని మోస్తారు. అక్షర్ పటేల్, కుల్దీప్, జడేజాలు స్పిన్ బాధ్యతలను మోయనున్నారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ,

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్‌లు కీలకంగా మారారు. రాహుల్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేకున్నా అతనికున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మెగా టోర్నీకి ఎంపిక చేశారు. హార్దిక్, జడేజా, శార్దూల్, అక్షర్‌ల రూపంలో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లుకు జట్టుకు అందుబాటులో ఉన్నారు. మొత్తం వరల్డ్‌కప్ కోసం మెరుగైన జట్టునే ఎంపిక చేశారని చెప్పాలి.

మెరుగైన జట్టునే ఎంపిక చేశాం..కెప్టెన్ రోహిత్ శర్మ
వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. మెగా టోర్నీ కోసం మెరుగైన జట్టునే ఎంపిక చేశామన్నాడు. జట్టు ఎంపికలో తీవ్ర పోటీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ చోటు కల్పించడం సాధ్యం కాదన్నాడు. ఇక రాహుల్‌ను ఎంపిక చేయడంలో ఎలాంటి తప్పులేదన్నాడు. ఎంతో అనుభవజ్ఞుడైన రాహుల్ సేవల్ జట్టుకు ఎంతో అవసరమన్నాడు. అందుకే అతన్ని ఎంపిక చేశామన్నాడు. మరోవైపు అశ్విన్, చాహల్‌లను ఎంపిక చేయక పోవడం బాధించే అంశమేనన్నాడు. అయితే జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని సార్లు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. మరోవైపు జట్టు ఎంపిక విషయంలో బయటవచ్చే విషయాలను తాను పట్టించుకోనని రోహిత్ స్పష్టం చేశాడు. టీమిండియా ఎంపిక ఎప్పుడూ సవాల్‌తో కూడిన అంశమేనన్నాడు. ఇలాంటి స్థితిలో జట్టు ఎంపిక జరిగిన ప్రతిసారి తనతో పాటు సెలెక్టర్లు విమర్శలను ఎదుర్కొవడం సర్వసాధారణంగా మారిందన్నాడు. కాగా, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్‌తో కలిసి రోహిత్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News